మరో రెండు రోజుల్లో యూఏఈలో ఐపీఎల్ 13వ ఎడిషన్ ప్రారంభం కానుంది. జట్ల సభ్యులందరూ ఇప్పటికే నెట్స్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేసి మ్యాచ్‌ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి టోర్నీలో గెలిచే జట్టు ఏదో మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ చెప్పేశారు. ఐపీఎల్ ట్రోఫీని 4 సార్లు కైవసం చేసుకున్న ముంబై ఇండియన్స్ కే ఈసారి కూడా ట్రోఫీని లిఫ్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
ముంబై ఇండియన్స్ టీం ఇప్పటికే 4 సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుందని, ఆ టీం ఫైనల్ మ్యాచ్‌లలో ఎలా ఆడాలో తెలుసుకుందని, అందువల్ల ముంబై టీంకే ఈసారి మళ్లీ ఐపీఎల్ టైటిల్‌ను సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గవాస్కర్ అన్నారు. చెన్నై టీం నాకౌట్ మ్యాచ్‌లకు వెళ్తున్నా… ఆ మ్యాచ్‌లో ముంబైని ఢీకొట్టలేకపోతుందన్నారు. ప్రస్తుతం ఉన్న అన్ని జట్లను పరిశీలిస్తే ఈసారి విన్నర్‌గా ముంబై ఇండియన్స్ నిలుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదని అన్నారు. ఆ టీంకు ఫైనల్‌కు వెళ్లడం పెద్ద కష్టం కాదని, ఫైనల్‌కు చేరితే ముంబైను ఎవరూ ఓడించలేరని అన్నారు.
కాగా ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 12 ఎడిషన్లు జరగ్గా.. వాటిల్లో ముంబై అత్యధికంగా 4 సార్లు టైటిల్‌ను గెలుచుకుంది. తరువాత 3 సార్లు చాంపియన్‌గా అవతరించి చెన్నై రెండో స్థానంలో నిలిచింది. కోల్‌కతా 2 సార్లు, హైదరాబాద్ 2 సార్లు (డెక్కన్ చార్జర్, సన్ రైజర్స్ కలిపి) విన్నర్లుగా నిలిచాయి. ఒకసారి రాజస్థాన్ గెలిచింది. ఈ క్రమంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ ఈసారి మరోమారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.