ప్రస్తుతం మనుషుల జీవన శైలి మారింది. కంప్యూటర్ యుగంలో ప్రజలు ఎల్లప్పుడు కొత్తదనం కోరుకుంటున్నారు. రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలు పెనుభూతంలా తాండవం చేస్తున్నాయి. ఇప్పటికీ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలు కొందరి పాలిట శాపంగా మారుతున్నాయి. మంత్రాలు, చేతబడులంటూ చాలా మంది ప్రజలు వాటిని నమ్ముతున్నారు. తాజాగా మెదక్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
క్షుద్ర పూజలు, మంత్రాల నెపంతో దుండగులు ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. నిజాంపేట్ మండలం చల్మెడ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శాల సుదర్శన్ అనే వ్యక్తిపై కొందరు దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.