ఎమ్మెల్యేలు పార్టీలు మారినా రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి బీఆర్ గవాయి అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడే కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోని ఉండాల్సిందని.. అప్పుడు చర్యలు తీసుకోలేదని, మళ్లీ ఇలా మాట్లాడుతున్నట్టున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటి నుంచి అయినా సీఎం రేవంత్ రెడ్డి కొంత సంయమనం పాటించాలని లేదంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కోర్టు ధిక్కారం కింద పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు.

శాసనసభ వేదికగా సీఎం చేసిన వ్యాఖ్యలు 10వ షెడ్యూల్‌ను అపహాస్యం చేసేలా ఉన్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. నాయకులు రామ్‌లీలా మైదాన్‌లో చెప్పినదానికి, అసెంబ్లీలో చెప్పిన దానికి తేడా ఉంటుందని.. అసెంబ్లీలో చెప్పిన మాటలకు విలువ ఉంటుందని వ్యాఖ్యానించింది. పార్టీలు మారినా ఉప ఎన్నికలు రావని ముఖ్యమంత్రి సభాముఖంగా చెప్పడం అంటే 10వ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడమే అవుతుందని పేర్కొంది. ఇలాంటి మాటలు రిపీట్ కావొద్దని సీఎంను అప్రమత్తం చేయడం మంచిదని వ్యాఖ్యానించింది.