వివేకా హత్య కేసు విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిందే : సుప్రీం కోర్టు

-

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులోని సాక్షులు, సీబీఐ అధికారులకు ఆంధ్రప్రదేశ్‌లో ఎదురవుతున్న బెదిరింపుల దృష్ట్యా అక్కడ నిష్పాక్షిక విచారణ, దర్యాప్తు జరుగుతుందని అనిపించడం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. అందువల్ల కేసు విచారణను వేరే రాష్ట్రానికి మార్చాలనుకుంటున్నామని వెల్లడించింది. దిల్లీ, తెలంగాణలో ఏ రాష్ట్రాన్నైనా ఎంపిక చేసుకోమని చెప్పింది.

ఈ కేసులోని నిందితులు శక్తిమంతులైనందున సాక్షులను బెదిరిస్తూ విచారణను జాప్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి, భార్య సౌభాగ్యమ్మలు దాఖలు చేసిన పిటిషన్లను బుధవారం విచారించిన జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. దర్యాప్తులో జాప్యంపై సీబీఐ మీద జస్టిస్‌ ఎంఆర్‌ షా ఆగ్రహం వ్యక్తం చేసింది.

వివేకా హత్య కేసు విచారణను దిల్లీ, తెలంగాణలలో ఏ రాష్ట్రాన్నైనా ఎంచుకోవచ్చని సుప్రీం కోర్టు సూచించింది. తెలంగాణ అయినా ఫర్వాలేదని సునీతా రెడ్డి న్యాయవాది చెప్పగా.. కర్ణాటక మేలని సీబీఐ అధికారులు అభిప్రాయపడ్డారు. వచ్చే శుక్రవారం ఈ కేసు బదిలీపై పూర్తిస్థాయి ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news