సుప్రీంకోర్టు తదుపరి సీజే ఎవరంటే..?

-

సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి అయిన జస్టిస్‌ యు.యు.లలిత్‌ (ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌) తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు బుధవారం కేంద్ర న్యాయశాఖ కార్యాలయం నుంచి సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కార్యాలయానికి వర్తమానం అందింది. దేశంలో తీవ్ర సంచలనం సృష్టించిన ట్రిపుల్‌ తలాక్‌ సహా అనేక కీలక అంశాల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్‌ యు.యు.లలిత్‌ భాగస్వామి.

ఆయన సీజేఐ అయితే బార్‌ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై అనంతరం సీజేఐ అయిన రెండో వ్యక్తి అవుతారు. 1971 జనవరిలో 13వ భారత ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్‌ ఎస్‌.ఎం.సిక్రీ నేరుగా సుప్రీంకోర్టు జడ్జి అయిన మొదటి న్యాయవాది. 1964లో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

ఇక జస్టిస్‌ యు.యు.లలిత్‌ ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఈ నెల 26 పదవీ విరమణ చేసిన మరుసటి రోజున (ఆగస్టు 27న) 49వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యేందుకు వరుసలో ఉన్నారు. నవంబరు 9, 1957న జన్మించిన ఆయన జూన్‌ 1983లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. డిసెంబరు 1985 వరకు బొంబాయి హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. జనవరి 1986 నుంచి తన ప్రాక్టీసును సుప్రీంకోర్టుకు మార్చారు. ఆగస్టు 13, 2014న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి అనేక కీలక తీర్పుల్లో భాగస్వామి అయ్యారు.

ట్రిపుల్‌ తలాక్‌ విధానంలో విడాకులు చెల్లుబాటు కావని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ 2017లో 3-2 మెజారిటీతో తీర్పు వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ యు.యు.లలిత్‌ సభ్యుడు. కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం నిర్వహణ హక్కు అప్పటి రాజకుటుంబానికి ఉంటుందని జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం రూలింగ్‌ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news