ఈడీ’కి ఆ అధికారాలున్నాయ్..! : సుప్రీం కోర్టు

-

మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని కీలక నిబంధనలను సుప్రీంకోర్టు సమర్థించింది. పలు నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను తోసిపుచ్చుతూ తీర్పు వెలువరించింది. ఈ చట్టం ప్రకారం పనిచేసే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తన దర్యాప్తులో భాగంగా చేస్తున్న సోదాలు, అరెస్టులు, ఆస్తుల సీజ్‌ వంటి అన్ని చర్యలను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. కారణాలు చెప్పకుండానే నిందితులను అరెస్టు చేసే అధికారం ఈడీకి లేదన్న వాదనను కూడా న్యాయస్థానం కొట్టిపారేసింది.

విచారణ సమయంలో బలవంతంగా వాంగ్మూలాలు నమోదు చేస్తోందని కార్తీ చిదంబరం, జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వంటి పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకురాగా ఆ వాదనను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేసు సమాచార నివేదిక- ఈసీఐఆర్​ను నిందితులకు ఇవ్వాల్సిన అవసరం లేదన్న కోర్టు.. అది ఎఫ్​ఐఆర్​తో సమానమని స్పష్టం చేసింది. ఆరోపణలపై ఆధారాల కోసం నిందితుడిపై ఒత్తిడి చేయడం అంటే అతడి ప్రాథమిక హక్కు, జీవించే హక్కును హరించడమేనని పిటిషనర్లు వాదించగా.. దేశ సమగ్రత, సౌభ్రాతృత్వానికి సవాళ్లుగా మారిన ఆర్థిక నేరాలను కట్టడి చేయాలంటే ఇలాంటి ఒత్తిళ్లు తప్పవని కేంద్రం పేర్కొంది. ఈ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ఈడీ అధికారాలను సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news