దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అదానీ గ్రూపు సంస్థల వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేయకుండా మీడియాను నియంత్రించేలా ఉత్తర్వులను ఇవ్వబోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అదానీ సంస్థలపై కథనాన్ని ప్రచురించిన హిండెన్‌బర్గ్ సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్‌సన్, ఆ సంస్థ భారతీయ ప్రతినిధులపై విచారణ జరిపేలా స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ, కేంద్ర హోంశాఖకు ఆదేశాలు ఇవ్వాలని ఎంఎల్ శర్మ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అదానీ లిస్టెడ్ కంపెనీలపై సెబీ ధ్రువీకరించనిదే వార్తలు ప్రసారం చేయకుండా మీడియాను నియంత్రించేలా గాగ్ ఆర్డర్ కూడా ఇవ్వాలని ఆయన సుప్రీం కోర్టును కోరారు. శుక్రవారం ఈ విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పరిశీలించారు. అనంతరం మీడియాను నియంత్రించేలా.. మీడియాకు వ్యతిరేకంగా ఎలాంటి నిషేధాజ్ఞలు ఇవ్వబోమని సీజేఐ స్పష్టం చేశారు.