సుశాంత్ సింగ్ మృతి కేసు విషయమై బాలీవుడ్ నటి రియా చక్రవర్తి పెట్టుకున్న పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం వరకు ఈ విషయమై కేసుకు సంబంధించిన అన్ని వర్గాలు తమ వివరణను కోర్టులో లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆదేశించింది. మంగళవారం సుప్రీం కోర్టులో సుశాంత్ కేసు విషయమై అన్ని వర్గాలు బలమైన వాదనను వినిపించాయి. ఓ దశలో కోర్టు హాల్‌లో వాదనలు వాడిగా వేడిగా జరిగాయి. న్యాయమూర్తులు వేసిన ప్రశ్నలకు రియా చక్రవర్తి కొంత ఆందోళనకు గురైంది.
సుశాంత్ సింగ్ కేసును పాట్నా పోలీసులు దర్యాప్తు చేస్తుండడంతో ఆ కేసును ముంబైకి ట్రాన్స్‌ఫర్ చేయాలని రియా గతంలో సుప్రీంలో పిటిషన్ వేసింది. అలాగే ఓ మీడియా సంస్థ ఈ విషయమై అనవసరంగా తలదూరుస్తుందని, ఆ విషయంపై కూడా చర్యలు తీసుకోవాలని రియా చక్రవర్తి సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది. మరోవైపు సుశాంత్ తండ్రి కేకే సింగ్ కోర్టులో రియా పిటిషన్‌కు వ్యతిరేకంగా కేవియట్ పిటిషన్ వేశారు. రియా అభ్యర్థనను కోర్టు అంగీకరించవద్దని కోరారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు ఇరువర్గాల వాదనలను మంగళవారం సావధానంగా విన్నది. అనంతరం రియా పిటిషన్ విషయమై గురువారం వరకు తీర్పును రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు తెలిపింది. అప్పటి వరకు రియాతోపాటు కేకే సింగ్, ముంబై పోలీసులు, సీబీఐ.. తదితర ఈ కేసుతో సంబంధం ఉన్నవారంతా రియా పిటిషన్‌పై లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
కాగా రియాచక్రవర్తి తరఫు న్యాయవాది శ్యాం దివన్ వాదిస్తూ.. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై ఇప్పటికే కోర్టులో ఇన్వెస్టిగేషన్ అధికారి ద్వారా అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. ముంబై పోలీసులు 56 మంది వ్యక్తుల స్టేట్‌మెంట్లను రికార్డు చేశారన్నారు. అందువల్ల వారు విచారణను పారదర్శకంగా చేపడుతున్నారని తెలిపారు. ఇక ఈ కేసుకు సంబంధించిన వివరాలను సుప్రీం కోర్టుకు ముంబై పోలీసులు సీల్డ్ కవర్‌లో ఇప్పటికే అందజేశారన్నారు.
అయితే సుశాంత్ సింగ్ కుటుంబం తరఫున వారి ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ వాదిస్తూ.. సుశాంత్ కేసును ఆలస్యం చేస్తున్నకొద్దీ రోజు రోజుకీ సాక్ష్యాలను లేకుండా మాయం చేస్తున్నారని అన్నారు. సుశాంత్‌ను తన తండ్రి, సోదరిలతో కలవకుండా రియా చక్రవర్తి అడ్డుకుందని తెలిపారు. అయినప్పటికీ అతను తన కుటుంబాన్ని మే లో కలుసుకున్నాడని తెలిపారు. ఇక ముంబై పోలీసులు ఈ కేసును తప్పుడు దోవలో విచారణ చేస్తున్నారని, సరైన మార్గంలో దర్యాప్తు చేయడం లేదని అన్నారు. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు అసలు నిందితులను పట్టుకోవడం లేదని అన్నారు.
ఈ క్రమంలో సుప్రీం కోర్టు ఈ కేసు విషయమై అన్ని వర్గాల వాదనలను విన్నది. అయితే కోర్టులో రియా చక్రవర్తి జడ్జి వేసిన పలు ప్రశ్నలకు తడబడింది. సీబీఐ విచారణ కావాలని అడిగి.. సీబీఐ కేసు టేకప్ చేశాక.. మళ్లీ సీబీఐ వద్దని ఎందుకు అడుగుతున్నారని కోర్టు రియాను ప్రశ్నించింది. అలాగే కేసును ఎవరు దర్యాప్తు చేయాలో రియా ఎలా చెబుతుందని, సీబీఐ ద్వితీయ విచారణ సంస్థ ఎందుకవుతుందని కూడా కోర్టు రియాను ప్రశ్నించింది. అందుకు రియా తడబడుతూ సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలో కోర్టు తీర్పును ఆగస్టు 13కు రిజర్వ్ చేయడంతో.. ఆ రోజున కోర్టు ఏమని తీర్పు చెబుతుందా.. అని ఆసక్తి నెలకొంది.