వరి ధాన్యాన్ని తెలంగాణలో విక్రయించేందుకు ఏపీ రైతులు ఇక్కడకు తీసుకువస్తున్నారని, అలాంటి చర్యలను అరికట్టాలని దీంతో తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో నిఘా పెంచాలని సూర్యాపేట కలెక్టర్ ఎస్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్పీ ఎస్ రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి రామాపురం క్రాస్‌రోడ్‌లో ఉన్న చెక్‌పోస్టును కలెక్టర్ ఎస్ వెంకట్రావు సందర్శించారు. ఏయే వాహనాలు వచ్చాయని నమోదు చేసిన రిజిస్ట్రర్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఏపీ నుంచి వరి ధాన్యాన్ని తెలంగాణకు తరలించి, ఇక్కడ అమ్మేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం అందిందని, ఈ నేపథ్యంలో నిఘా పెంచాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయన్నారు. చాలా చోట్ల వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని తెలిపారు కలెక్టర్ ఎస్ వెంకట్రావు . పోలీసులు, రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులు సమన్వయంతో చెక్‌పోస్టు వద్ద నిఘా పెంచి, వరి ధాన్యం తరలించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన వెల్లడించారు.