కేసీఆర్ ప్రభుత్వానికి కూలే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్. జిట్టా బాలక్రిష్ణారెడ్డి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని.. తెలంగాణ కేసీఆర్ సొత్తేమీ కాదు… అందరం ఉద్యమం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఉద్యమ కాంక్షలు నెరవేరలేదనే భావనతోనే సదస్సు నిర్వహించారని.. కేసీఆర్ పనితీరు, ప్రభుత్వ విధానాలపై నాటక రూపంలో ప్రదర్శన చేయడం నేరమెలా అవుతుందని పేర్కొన్నారు స్వామిగౌడ్.
గతంలో తెలంగాణ ఆకాంక్షలు, ఆంధ్రా పాలకుల మోసాలపైనా కేసీఆర్ సమక్షంలోనే అనేక కళా ప్రదర్శనలు చేసిన సంగతి గుర్తు లేదా? అని ప్రశ్నించారు స్వామిగౌడ్. ఆనాడు చప్పట్లు కొట్టి దగ్గరుండి… కళాప్రదర్శనలు, నాటకాలు ప్రోత్సహించిన కేసీఆర్… ఇప్పుడు కళాకారులపై ఉక్కుపాదం మోపుతారా? పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం సరికాదు… చట్టానికి లోబడి విధులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తక్షణమే జిట్టా బాలక్రిష్ణారెడ్డిపై నమోదు చేసిన కేసులు…కొట్టివేయాలని డిమాండ్ చేశారు.