ప్రపంచమంతా కరోనా అంటే భయపడుతున్న వేళ.. ఓ దేశం మాత్రం అన్ని దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కరోనా కట్టడిలో తైవాన్ తీసుకున్న చర్యలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయ్. కరోనా వైరస్ బయటపడ్డ వెంటనే అప్రమత్తమైన తైవాన్, ముందుగా సరిహద్దుల వద్ద ఆంక్షలు విధించింది. దేశంలోకి వచ్చే వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతోపాటు వారి మొబైల్ సిగ్నల్ ద్వారా 14రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షించింది. తద్వారా ముందస్తుగానే వైరస్ ఉన్న వ్యక్తులను దేశంలోకి రాకుండా జాగ్రత్తపడింది.
కరోనాపై విజయంలో తైవాన్ చేపట్టిన మాస్కుల పంపిణీ భారీ సత్ఫలితాలిచ్చిందనే చెప్పవచ్చు. వైరస్ వ్యాప్తి ప్రారంభమైన వెంటనే మాస్కుల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. అంతేకాకుండా స్థానికంగా వాటి ఉత్పత్తిని భారీగా పెంచింది. నిబంధనలు ఉల్లంఘించిన వెయ్యి మందికి జరిమానా కూడా విధించింది. అంతేకాకుండా కరోనా సమయంలో ఆర్థికంగానూ తైవాన్ దూసుకెళ్తోంది.
2003లో సార్స్ విజృంభణ నుంచే తైవాన్ పాఠాలు నేర్చుకుంది. అప్పుడు వందల మంది సార్స్ బారినపడగా 73మంది మృత్యువాతపడ్డారు. అప్పట్లో ప్రపంచంలో సార్స్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో తైవాన్‌ది మూడో స్థానం. అంతేకాకుండా బర్డ్ ఫ్లూ, ఇన్ఫ్లూయెంజా వంటి వైరస్‌లను ఎదుర్కొన్న తీరును కూడా తైవాన్ పరిగణనలోకి తీసుకుంది. వాటి అనుభవాల నుంచి కరోనా వైరస్ విషయంలో ఎలా వ్యవహరించాలో ముందస్తుగానే అంచనా వేసింది.