మహానగరంలో సొంత ఇళ్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. తెలంగాణ ప్రభుత్వం అర్హులైన పేదలకు మరో మూడు రోజుల్లో గృహ ప్రవేశం లభిస్తుంది. ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన అధికారులు ర్యాండమైజేషన్ పద్ధతిలో అర్హులను ఎంపిక చేశారు. అయితే.. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. వేలాదిమంది పేద ప్రజల సొంత ఇంటి కల సెప్టెంబర్ 2 వ తేదీన నెరవేరబోతుందని అన్నారు.
బుధవారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, GHMC పరిధిలోని మంత్రులు మల్లారెడ్డి, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన కలెక్టర్లు అనుదీప్, హరీష్, అమయ్ కుమార్, నగరానికి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందిస్తున్నదని మంత్రి తలసాని చెప్పారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో మొదటి విడతలో 12 వేల మంది లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు మంత్రి తలసాని చెప్పారు.
ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన లబ్ధిదారులను ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా ఎంతో పారదర్శకంగా ఆన్ లైన్ డ్రా పద్ధతిలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 500 మంది చొప్పున ఎంపిక చేశామన్నారు. లబ్ధిదారుల వివరాలను సంబంధిత ఎమ్మెల్యేలకు అందజేయాలని జిల్లా కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. ఇండ్ల పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. GHMC పరిధిలోని 8 ప్రాంతాలలో లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సెప్టెంబర్ 2 వ తేదీన కేటాయించనున్నట్లు చెప్పారు.