తాప్సీ బర్త్​డే స్పెషల్​.. సాఫ్ట్​వేర్​ టు మోడలింగ్​.. కట్​ చేస్తే స్టార్​ హీరోయిన్​గా

-

తాప్సీ పన్ను… టాలీవుడ్​తో కెరీర్​ ప్రారంభించి, ప్రస్తుతం బాలీవుడ్‌ బిజీ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 40చిత్రాలకు పైగా నటించిన ఈ ముద్దుగుమ్మ లేడీ ఓరియెంటెడ్, కమర్షియల్​, బయోపిక్​లు అంటూ కెరీర్​లో దూసుకెళ్తోంది. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ.. తనకంటూ ప్రత్యేక అభిమానగణాన్ని సొంతం చేసుకుంది. నేడు ఆమె బర్త్‌డే సందర్భంగా కొన్ని విశేషాలు మీకోసం…

తాప్సీ అంటే ‘చలాకీ’ అని అర్థం. పేరుకి తగినట్లుగానే ఈ దిల్లీ భామ బాలీవుడ్‌లో చలాకీగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో దాదాపు అరడజను హిందీ సినిమాలు ఉన్నాయి. ఇందులో రెండు, మూడు కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు కావటం విశేషం.

నిజానికి తాప్సీ అసలు పేరు ‘తపసీ’ కాగా, చిన్నతనంలో ఆ పేరుని రకరకాలుగా పిలవడంతో ‘తాప్సీ’ గా మార్చుకున్నానని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. ఇక తెలుగులో వచ్చిన ‘మిస్టర్‌ పర్పెక్ట్‌'(2011)సినిమాలో ఈమె పాత్ర పేరు ‘మ్యాగీ’. తదనంతరం ఈ పేరే తన ముద్దు పేరుగా స్థిరపడిపోయింది.

కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ పొందిన తాప్సీ కెరీర్‌ ప్రారంభంలో ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది. అది నచ్చక మోడలింగ్‌ వైపు అడుగులు వేసింది. రెడ్‌ ఎఫ్ఎమ్‌, కోకాకోలా, మోటరోలా ప్రకటనలలో తళుక్కుమంది. వాటి ద్వారానే తెలుగు సీనియర్‌ దర్శకుడు రాఘవేంద్రరావు దృష్టిలో పడి ‘ఝుమ్మంది నాదం'(2010)లో అవకాశం దక్కించుకుంది.

తెలుగులో దాదాపు 17చిత్రాల్లో నటించిన ఈమె తమిళంలో ఆడుకాలమ్‌ (2011)చిత్రంతో ఎంట్రీ ఇచ్చి దాదాపు ఆరు సినిమాల్లో నటించింది. ‘డబుల్స్”(2011) అనే మలయాళ చిత్రంలో కీలకపాత్రలో మెరిసింది. 2013లో ‘ఛష్మే బద్దూర్‌’ సినిమాతో హిందీ చిత్ర సీమలోకి ప్రవేశించి ‘బేబి(2015), పింక్‌(2016) చిత్రాలతో వరుస విజయాలు సాధించింది. ‘పింక్‌’ సినిమా విజయంతో కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్రలకు తగిన నటిగా ఈమె ప్రత్యేక గుర్తింపు పొందింది.

హిందీలో వరుస విజయాలు సాధిస్తున్న తాప్సీ ‘సాండ్‌ కి ఆంఖ్‌’‌(2019),’థప్పడ్‌'(2020) చిత్రాల్లో నటనకు గాను ఉత్తమ నటిగా రెండు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు సాధించింది. స్త్రీ ప్రాధాన్యం ఉన్న పాత్రలకు కేరాఫ్‌ అడ్రెస్‌గా నిలుస్తున్న తాప్సీ త్వరలో రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో రానున్న ‘డుంకీ’ చిత్రంలో షారుక్‌ ఖాన్‌ సరసన నటిస్తోంది.

ఈ మధ్య కాలంలో తాప్సీ సినీ నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టారు. ‘అవుట్‌ సైడర్స్‌ ఫిల్మ్స్‌’ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు తాప్సీ ఇటీవల ప్రకటించింది. ఈ సంస్థ ద్వారా బాలీవుడ్‌లో ‘న్యూ టాలెంట్‌’ని ప్రోత్సహిస్తామని ఈమె ప్రకటించింది.

బంగాళదుంపలతో కూడిన ఏ ఆహారమైనా తాప్సీ ఇష్టంగా ఆరగిస్తుంది. పాల ఉత్పత్తులకు ఆమడ దూరంలో ఉంటుంది. చిన్నతనంలో రోజూ ఫుడ్‌ మెనూలో బంగాళదుంప కర్రీ ఉండాలని గొడవ చేసి దెబ్బలు తిన్న రోజులు ఉన్నాయట. నాన్‌వెజ్‌లో సీఫుడ్‌ ని బాగా ఇష్టపడుతుంది.

సినిమాలకు సంబంధించి తనకు నచ్చని అంశం మేకప్‌ అని ఈమె కొన్ని సందర్భాల్లో చెప్పటం విశేషం. ముఖ్యంగా హీరోయిన్ల అందం, శరీర ఛాయను బట్టి వారి నైపుణ్యాన్ని అంచనా వేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తానని ఆమె పలు ఇంటర్వ్యూలలో చెప్పింది. కనీసం తన పెళ్లిలో అయినా మేకప్‌ లేకుండా ఫొటోషూట్‌లో పాల్గొంటానని పేర్కొంది.

సినిమాలతో పాటు కొన్ని పబ్లిక్‌ సంబంధిత అంశాల్లోనూ పలు వ్యాఖ్యలు చేసి తాప్సి వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనారనౌత్‌కి తాప్సీకి మొన్నామధ్య ట్విటర్‌ వేదికగా మాటల యుద్ధం నడిచింది. ‘కంగనా డీఎన్‌ఏ లోనే సమస్య ఉందం’టూ ఈ అమ్మడు ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఈ మధ్య కాలంలో ఈ ముద్దుగుమ్మ ప్రేమ వ్యవహారం కూడా హాట్‌టాపిక్‌ గా మారింది. డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు ‘మాథియాస్‌ బో’తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అతనితో సమయం గడపటం తనకిష్టమని, అత్యంత సన్నిహితుడని పలు సందర్భాల్లో బాహాటంగానే మీడియాకు తెలిపింది.

సినిమారంగంలోనే కాకుండా వ్యాపారంలోనూ తాప్సీ సత్తా చాటుతోంది. ‘ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ’ పేరుతో ఖరీదైన వేడుకలను నిర్వహించే సంస్థను ముంబైలో ఏర్పాటు చేసింది. ఇంకా ‘పూణె 7 ఏసెస్‌(Pune 7 Aces) పేరుతో ఒక ఫ్రాంఛైజీ బ్యాడ్మింటన్‌ టీమ్‌కు యజమానిగా వ్యవహరిస్తోంది. తన బాయ్‌ఫ్రెండ్‌ ‘మాథియాస్‌’ ఈ టీమ్‌కి కోచ్‌గా ఉన్నాడు. 2018నుంచి ‘ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌’ లో ఈ జట్టు పాలు పంచుకుంటోంది.

స్త్రీ, మహిళా సంబంధిత అంశాలపై తాప్సీ ఎక్కువగా స్పందిస్తుంది. ఈ మధ్యే మహిళల అంతరంగిక సమస్యలకు పరిష్కారాన్ని చూపే ‘పీరియడ్‌ పాల్‌’ అనే యాప్‌ని రూపొందించడంలో భాగస్వామిగా ఉండటంతో పాటు, దానికి ప్రచారకర్తగా కూడా వ్యవహరించింది.

Read more RELATED
Recommended to you

Latest news