సినీ నటుడు తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ఆయనకు గత కొన్నిరోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. ఇవాళ తారకరత్నకు ఎంఆర్ఐ స్కానింగ్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు.
తారకరత్నకు మెదడుకు సంబంధించిన వైద్య సేవలు కొనసాగుతున్నాయని వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన హెల్త్ బులిటెన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. జనవరి 27న కుప్పంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తారకరత్నకు గుండెపోటు రాగా ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ను నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. విదేశీ వైద్యులను ఆ ఆస్పత్రికి రప్పించి ట్రీట్‌మెంట్ చేయిస్తున్నట్టు ఆయన కుటుంబ సభ్యుడు రామకృష్ణ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు.