ఆయన 20ఏళ్ల రాజకీయ జీవితం వడ్డించిన విస్తరి. ప్రతికూల పరిస్థితుల్లోనూ నెగ్గుకురావడం తెలిసిన దిట్ట. పదవులు, పవర్ ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉంటారు. స్వపక్షం,విపక్షం అన్న తేడా లేకుండా తాను అందరి పక్షం అని చెప్పుకుని మెప్పించుకుంటారు. అలాంటి నేత ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా మారాడు….
మాజీ మంత్రి గంటా శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తరచు వినిపించే పేరు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఈ సీనియర్ నేత పొజిషన్లో ఉన్న అపోజిషన్లో వున్నా తన పేరు జనం నోట్లో నానాలని కోరుకుంటారు. ఎప్పటికప్పుడు రాజకీయం అవసరాలకు అనుగుణంగా పార్టీలు మార్చడం ఈయనకు అలవాటు. ఐతే,20 ఏళ్ల పొలిటికల్ కెరీర్ ను నల్లేరుపై నడకలా సాగించిన గంటాకు 2019 తర్వాత రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. వైసీపీ హవాను సైతం ఎదుర్కొని నిలబడ్డ ఆయన ఇప్పుడు తాను ఏ పార్టీలో ఉన్నానో చెప్పుకోలేని పరిస్థితి.
ఎన్నికల తర్వాత వైసీపీలో చేరుతారనే విస్త్రతంగా ప్రచారం జరిగింది. ఆ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో వర్కవుట్ అయినప్పటికీ పలు ముహుర్తాలు దాటిపోయాయి. రాజకీయం గా ఈ పరిణామాలకు కారణాలు ఏవైనప్పటికీ గంటా మాత్రం సెంటి మెంట్ గా ఫీలవుతున్నారట. అనుకున్న పని ఆలస్యం అవ్వడంతో కొంత కాలం రాజకీయ ఊహాగానాలు నుంచి దూరంగా ఉండాలని భావిస్తున్నారట. కాలం కలిసి వచ్చే వరకు రాజకీయాల్లో కి రాక ముందు షిప్పింగ్ కంపెనీ నడిపిన ఆయన ఇప్పుడు మళ్లీ కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెట్టారు.
అయితే ఇంతకాలం తెలుగు దేశంతో గంటా దూరంగా వుంటుంన్నానేది నిన్నటి వార్త. ఇప్పుడు TDPనే గంటాను దూరం పెట్టడం తాజా పరిణామం. కొన్ని అంశాల్లో కఠినంగా ఉండాలని హైకమాండ్ భావించడమే దీనికి కారణంగా చెప్పుకుంటున్నారు. ఎదురుగాలి వీచినా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలిచిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మాత్రం ఏ బాధ్యతనూ బాబు ఇవ్వలేదు. తాజాగా ప్రకటించిన టిడిపి ఎపి కమిటీలో విశాఖకు చెందిన చాలామందికి పదవులు దక్కాయి. ఇటీవల నియమించిన పార్లమెంటరీ కమిటీలు, పొలిట్ బ్యూరో లు జాతీయ కమిటీలు మెుదలుకొని పార్టీ అధిష్టాన౦ 221మ౦ది జంబో సైజ్ పార్టీ పదవులను డిజైన్ చేసినా గంటాకు ఎందుకు ఏ పదవీ ఇవ్వలేదన్నది టీడీపీలో ఆసక్తిని రేకెత్తిస్తోంది
విశాఖ ఉత్తరంలో గంటాకు చోటులేకపోయినా ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు సహా ముగ్గురికి చోటు కల్పించింది అధిష్టానం. ఎక్కడ గ౦టా పేరు మచ్చుకైనా కానరాకపోవటమే టీడీపీతో గంటాకు పూర్తిస్థాయిలో బలహీనపడ్డ సంబంధాలకు నిదర్శనం అనే అభిప్రాయం ఉంది. ఇప్పటికే విశాఖ లో తమ ఎమ్మెల్యేల సంఖ్యను రెండుకు కుదించుకున్న టీడీపీ గంటాను లైట్ తీసుకుందనే టాక్ నడుస్తోంది.