యువనేత తీరుతో టీడీపీ కంచుకోట ఖాళీ అవుతోందా?

-

టీడీపీకి ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ అడ్రస్‌ లేకుండా పోయిందా. కార్యకర్తలు ఫోన్‌ చేస్తున్నా పట్టించుకొనే నాయకుడే కరువయ్యాడా అంటే చిత్తూరుజిల్లా శ్రీకాళహస్తిలో అవుననే సమాధానమే వినిపిస్తుంది. టీడీపీ ఇక్కడ ఆరుసార్లు విజయం సాధించింది. ఈ నియోజకవర్గం పేరు చెబితే మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేరు గుర్తుకొచ్చేది. ఇక్కడ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. రెండు దఫాలు మంత్రిగానూ పనిచేశారు. నియోజకవర్గాన్ని పార్టీపరంగానే కాకుండా.. తనకు కూడా కంచుకోటగా మలుచుకున్నారు బొజ్జల. అలాంటి చోట ఆయన తనయుడు కారణంగా బీటలు వారుతోందని తెలుగు తమ్ముళ్లు కామెంట్స్‌ చేస్తున్నారట.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కోరిక మేరకు ఆయన తనయుడు బొజ్జల సుధీర్‌రెడ్డికి శ్రీకాళహస్తి టీడీపీ టికెట్‌ ఇచ్చారు. ఎంత పోరాడినా.. వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు సుధీర్‌రెడ్డి. ఆ ఓటమి తర్వాత నియోజకవర్గంలో బొజ్జల కుటుంబం ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని అంటున్నారు. నియోజకవర్గంలో టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నా.. కేసులు పెడుతున్నా పట్టించుకునే వారు లేరని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారట. ఇదే విషయాన్ని పలుమార్లు చిత్తూరు జిల్లా నాయకులు, టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట.

ఇంత జరుగుతున్నా బొజ్జల కుటుంబం స్పందించకపోవడంతో శ్రీకాళహస్తిలో టీడీపీకి దిక్కెవరని ప్రశ్నిస్తున్నారు కార్యకర్తలు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపిచ్చినా.. ఇక్కడ చేపట్టేవారు లేరని అంటున్నారు. కరోనా సమయంలో స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి చేపట్టిన ర్యాలీ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయినా టీడీపీ నుంచి రియాక్షనే లేదు. ఎన్నికల సమయంలో వచ్చిన నేతలు.. మాట్లాడిన వారంతా చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోయారే కానీ తమ గోడు వినడం లేదని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. పొరుగు నియోజకవర్గాల్లోని టీడీపీ నేతల దగ్గరకు వెళ్లి తమ సమస్యలు చెప్పుకొంటున్నారట. ఇదే విషయాన్ని నారా లోకేష్‌కు కొందరు ఫిర్యాదు చేశారట.

ఇప్పటికే నాయకుడు లేక .. చాలా మంది టీడీపీ నేతలు వైసీపీలోకి జంప్‌ చేసేశారు. సుధీర్‌రెడ్డితో విసుగు చెందినవారు కూడా ఇదే బాట పట్టారు. పార్టీపై అభిమానం ఉన్నవారిలో అతికొద్దిమందే సైలెంట్‌గా ఉన్నారట. ఒకప్పుడు టీడీపీ జెండా రెపరెపలాడిన చోట..ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ కనుమరుగు కావడం ఖాయమంటున్నారు. ఇదే సమయంలో శ్రీకాళహస్తిలో బొజ్జల బ్రాండ్‌ను కనుమరుగు చెయ్యాలని వైసీపీ పావులు కదుపుతోంది. ఈ చర్యలను కూడా సుధీర్‌రెడ్డి అడ్డుకోవడం లేదని చెబుతున్నారు. మరి.. టీడీపీ పెద్దలు శ్రీకాళహస్తిని అలాగే వదిలేస్తారో.. పార్టీ కేడర్‌లో జోష్‌ నింపే నేతను తీసుకొస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news