గెలిచిన ఏడాదిన్నరకే ఆ ఎంపీ పై ముఖం మొత్తిందా

-

ఎంపీగా గెలిచి ఏడాది అయ్యింది. అప్పడే రాజకీయాలు విరక్తి కలిగాయో.. లేక రాజకీయాలు వంటబట్టలేదో కానీ.. ఆయన తీరు అధికార పార్టీలో చర్చకు దారితీస్తోంది. జనాలకు దూరంగా ఉంటున్నారని టాక్‌. ప్రత్యర్థులు వేగంగా పావులు కదుపుతున్నా చీమకుట్టినట్లయినా లేదట. దీంతో నియోజకవర్గ ప్రజలు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారట..

పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంటేష్‌నేత టీఆర్‌ఎస్‌లో హాట్‌ టాపిక్‌గా మారారు. ప్రజాసేవే పరమావధిగా భావించి ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చినట్లు అప్పట్లో చెప్పుకొనేవారు. అలాంటి నాయకుడు ఇప్పుడు ప్రజలు చూద్దామంటే కనిపించడం లేదని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి టీఆర్‌ఎస్‌ క్యాండిడేట్‌ బాల్క సుమన్‌ చేతిలో ఓడిపోయారు వెంకటేష్‌. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ చేరిపోయారు.

అప్పటి వరకూ ఎంపీగా ఉన్న బాల్క సుమన్‌ ఎమ్మెల్యే కావడంతో.. ఖాళీ అయిన పెద్దపల్లి టీఆర్‌ఎస్‌ టికెట్‌ను వెంకటేష్‌నేతకు ఇచ్చారు. ఎంపీగా గెలిచారు. అయితే ఈ ఏడాది కాలంలో వెంకటేష్‌ వ్యవహారశైలిలో ఎంతో మార్పు వచ్చిందని అధికార పార్టీలో గుస గుస లాడుకుంటున్నారు. గతంలో పెద్దపల్లి ఎంపీగా ఉన్న బాల్క సుమన్‌ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రజలతో మమేకమయ్యేవారని గుర్తు చేసుకుంటున్నారట. ప్రస్తుత ఎంపీ వెంకటేష్‌ అదే పార్టీకి చెందిన నాయకుడైనా ఆయన తీరు భిన్నంగా ఉందని అంటున్నారు.

ప్రజలకే కాదు.. పార్టీ శ్రేణులకు కూడా ఎంపీ అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రజలు ఆయా సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యేలనే ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. మరోవైపు- మైక్‌ దొరికితే అనర్గళంగా మాట్లాడే వెంకటేష్‌కు చేతలు తక్కువేనని మరో వర్గం ప్రచారం మొదలుపెట్టిందట. నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు అతిథిగా వచ్చి వెళ్లిపోవడం తప్ప ఎవరితోనూ కలుపుగోలుగా ఉండరని అంటున్నారు. పైగా ఆవేశం వస్తే ఏం మాట్లాడతారో.. ఎక్కడ నోరు జారతారో అని లోకల్‌ లీడర్స్‌ టెన్షన్‌ పడతారట. దీంతో ఆయన్ని పిలవాలంటే స్థానిక ఎమ్మెల్యేలు కాస్త తటపటాయిస్తారని టాక్‌.

ఇదే సమయంలో టీఆర్‌ఎస్‌ను వీడి ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన మాజీ ఎంపీ వివేక్‌ పెద్దపల్లి పరిధిలో మళ్లీ పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తున్నారట. మొన్నటి మున్సిపల్‌ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తరఫున ఎంపీ వెంకటేష్‌ సరిగా ప్రచారం చేయలేదనే విమర్శలు ఆయన పార్టీలోనే వినిపించాయి. ప్రత్యర్థులు పావులు కదుపుతుంటే.. సిటింగ్‌ ఎంపీ కామ్‌గా ఉండటం అధికార పార్టీ శ్రేణులకు రుచించడం లేదట. ఈ విషయాలు ఇప్పటికే పార్టీ పెద్దల దృష్టికి వెళ్లినట్లు చెబుతున్నారు. మరి.. ఎంపీ వెంకటేష్‌ వ్యవహారంపై టీఆర్‌ఎస్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలంటున్నాయి పార్టీ శ్రేణులు.

Read more RELATED
Recommended to you

Latest news