మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పరిణామాలపై టీడీపీ జగనాసుర రక్తచరిత్ర అనే పుస్తకాన్ని ఆవిష్కరించింది. వివేకా హత్యకు జగన్ ప్యాలెస్‌లోనే పథక రచన జరిగిందని ఆరోపించింది. సీబీఐ విచారణలో వేళ్లన్నీ సీఎం దంపతులపైనే చూపిస్తున్నందున ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.
వివేకా హత్య జరిగిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై ‘జగనాసుర రక్తచరిత్ర’ పేరిట రూపొందించిన పుస్తకాన్ని ముఖ్యనేతలు వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బొండా ఉమ తదితరులతో కలిసి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు. వివేకా హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరనే దానిపై వివరాలను పేర్కొంటూ పుస్తకాన్ని రూపొందించారు.
‘వివేకా హత్యపై దుష్ప్రచారంతో 2019 ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ లబ్ధి పొందారు. వివేకాను టీడీపీ అధినేత చంద్రబాబే హత్య చేయించారని ఎన్నికల సమయంలో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. వివేకాది హత్య కాదని… గుండెపోటని చెప్పి.. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి కలిసి హత్యకు సంబంధించిన ఆనవాళ్లు ఏమీ లేకుండా చేశారు. ఈ కేసులోని అంశాలను దృష్టిలో పెట్టుకొని వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తాం’’’ అని టీడీపీ నేతలు అన్నారు.