ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంశం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. చాలా కాలం నుంచి సొంత ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కోటంరెడ్డి..సొంత పార్టీ తన ఫోన్ ట్యాప్ చేసిందని మనస్తాపం చెంది వైసీపీని వీడిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయన ఏదొరకంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అటు వైసీపీ నేతలు కూడా కోటంరెడ్డికి కౌంటర్లు ఇస్తున్నారు.
ఇదే సమయంలో కోటంరెడ్డి రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందనే అంశంపై చర్చ నడుస్తోంది. అయితే ఆయన టిడిపిలోకి వెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. కానీ ఏ నిర్ణయమైన చంద్రబాబు తీసుకోవాలని సూచించారు. తాజాగా కూడా మళ్ళీ తరహాలో మాట్లాడారు. టీడీపీ నుంచి పోటీ చేయాలన్నదే తన ఆకాంక్ష అని దానికి పార్టీ అధినేత చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలని, తనని ఎవరు ట్రాప్ చేయలేదని, ఒక ఎమ్మెల్యే కోసం ట్రాప్ చేయాల్సిన అవసరం చంద్రబాబుకు లేదని వైసీపీకి కౌంటర్ ఇచ్చారు.
అదే సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంలో వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ గుర్తు మీద గెలిచి వైసీపీలో చేరిన వారి దగ్గర స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేయించి, ఎన్నికల్లో గెలిచి అప్పుడు తన రాజీనామా ప్రస్తావన తీసుకురావాలని, మీరు చేస్తే పవిత్రం. తాను చేస్తే అపవిత్రమా? అంటూ వైసీపీపై ఫైర్ అయ్యారు.
అంటే ఈయన క్లియర్ గా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయరని తెలుస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన వారిలో నలుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా వైసీపీ వైపుకు వెళ్లారు. అధికారికంగా పార్టీలో చేరలేదు..కానీ అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేలుగా చెలామణి అవుతున్నారు. ఇప్పుడు అదే ఫార్మాట్లో కోటంరెడ్డి వెళ్లనున్నారు. టిడిపికి అనుకూలంగా నడిచేలా ఉన్నారు. మరి బాబు..కోటంరెడ్డిని టిడిపిలోకి తీసుకుని నెల్లూరు రూరల్ సీటు ఇస్తారో లేదో చూడాలి.