హీరో నాని తల్లిని వైసీపీ నేతలు టార్గెట్ చేస్తారు : టీడీపీ నేత అనిత

టిక్కెట్‌ ధరలపై హీరో నాని కామెంట్లపై తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత స్పందించారు. హీరో నానికి థ్యాంక్స్‌ చెబుతున్నానని.. సినీ ఇండస్ట్రీలో వాళ్లకి ఇప్పటికైనా నొప్పి తెలిసిందని పేర్కొన్నారు. రెండున్నరేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న విధానాలపై సినీ ఇండస్ట్రీ స్పందించలేదని.. ఈ ప్రభుత్వ విధానాలతో మాకు సంబంధం లేదనుకున్నారో.. భయపడ్డారో కానీ సినిమా వాళ్లు స్పందించలేదని చురకలు అంటించారు.

సినీ ఇండస్ట్రీకి ఇప్పుడు సెగ తాకింది కాబట్టి.. ఇప్పటికైనా హీరో నాని వంటి వారు స్పందించినందుకు థ్యాంక్స్‌ అన్నారు. పెట్రోల్‌ ధరలకు తగ్గించరు.. నిత్యావసరాల వస్తువుల ధరలను తగ్గించరు.. కానీ ఈ ప్రభుత్వం సినిమా టిక్కెట్ ధరలను మాత్రం తగ్గించిందని.. సినిమా టిక్కెట్‌ ధరలు తగ్గించి ప్రజలను ఉద్దరించామని ప్రభుత్వం చెప్పుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వం తీరును నాని తప్పుపట్టారని వైసీపీ విమర్శిస్తోందని…వైసీపీ నేతలు హీరో నాని తల్లి గురించి మాట్లాడినా ఆశ్చర్యపోనక్కర్లేదని పేర్కొన్నారు. ఆయన తల్లిని వారు టార్గెట్ చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నో మొన్నో బొత్స.. అశోక్‌ గజపతి రాజు తల్లి గురించి ఏదో మాట్లాడారు కదా..? ఇపుడు నాని తల్లిపై కామెంట్లు చేస్తారని ఆరోపణలు చేశారు.