కృష్ణా టీడీపీలో మరో రెండు షాకులు బొండా, బోడే రూపంలో తగలనున్నాయా ? మూలిగే నక్కమీద తాటిపండు పడిన చందంగా ఉన్న టీడీపీకి వీరిద్దరు కూడా షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారా ? అంటే ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో అవుననే ఆన్సర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికలు ముగిసినప్పటి నుంచి పార్టీకి తగులుతున్న వరుస షాకుల పరపరంలో కృష్ణా జిల్లాలోనే ఇద్దరు కీలక నేతలు పార్టీకి షాక్ ఇచ్చారు.
గుడివాడలో పోటీ చేసిన, ఏపీ తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్‌తో పాటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఇద్దరూ పార్టీ వీడారు. వీరిలో అవినాష్ వైసీపీలోకి జంప్ చేయగా.. వంశీ కూడా తాను వైసీపీలోకి వెళతానని ప్రకటించారు. ఇక ఈ లిస్టులో నెక్ట్స్ మాజీ ఎమ్మెల్యేలు బొండా ఉమా, బోడే ప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో బొండా ముందు నుంచి పార్టీలో అసమ్మతి గళం వినిపిస్తున్నాడు.
పార్టీ అధికారంలో ఉన్నప్పుడే తనకు మంత్రి పదవి రాలేదని బాబు కాపుల గొంతు కోశారంటూ నానా రచ్చ రచ్చ చేశారు. ఎన్నికల్లో 25 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిన బొండా అప్పుడే పార్టీ మారిపోతారన్న ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ఇక ఆ తర్వాత కూడా బొండాకు తూర్పు సీటు ఇస్తే ఆయన పార్టీ మారడానికి రెడీ అన్న వార్తలు కూడా వచ్చాయి.
ఇక ఇప్పుడు అవినాష్‌కు తూర్పుపై హామీ వచ్చిందని అంటున్నారు. ఈ లెక్కన బొండా పార్టీ మారుతారని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఆయన ఏ హామీతో వెళతారన్నది డౌట్‌గానే ఉంది. ఇక పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సైతం విపరీతమైన ఒత్తిళ్ల నేపథ్యంలో పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రసాద్ నియోజకవర్గంలో బలమైన నేత అయినా… వచ్చే ఎన్నికల వరకు అక్కడ పార్టీని అంటి పెట్టుకుని ఉన్నా.. సీటు వస్తుందన్న గ్యారెంటీ లేదని టాక్..?
ఇందుకు ప్రధాన కారణం మంగళగిరిలో ఓడిన లోకేష్ పెనమలూరు మీద కన్నేసినట్టు తెలుస్తోంది. ఇటీవల పెనమలూరులో అవినాష్ రెండు, మూడు కార్యక్రమాల్లో పాల్గొంటేనే నేరుగా లోకేష్ నుంచి అక్కడ నీకు పనేంటి ? నువ్వు గుడివాడకే పరిమితం కావాలని చెప్పడం కూడా అవినాష్ హర్ట్ అవ్వడానికి కారణం. ఇక ఇప్పుడు బోడే సైతం సీటుపై గ్యారెంటీ లేకపోవడంతో పార్టీ మార్పు ఆలోచన చేస్తున్నట్టు చర్చలు వినిపిస్తున్నాయి. అయితే అక్కడ వైసీపీ నుంచి సీనియర్ నేత పార్థసారథి ఉన్నారు. ఏదేమైనా టీడీపీకి చెందిన ఈ ఇద్దరు కీలక నేతల పొలిటికల్ రూటు ఎలా ఉంటుందో ? చూడాలి.