ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకి మరో షాక్ తగలనుంది. టీడీపీ ఎమ్మెల్యే, గంటా శ్రీనివాసరావు మరికొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. గురువారం ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ను కలిసి కీలక మంతనాలు జరిపారు. గంటాతో పాటు ఎంతమంది బీజేపీలో చేరతారన్న విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ వారు బీజేపీతో చేతులు కలిపితే అనర్హత వేటు పడడం, ఇతర న్యాయపరమైన అంశాల గురించి వారు చర్చలు జరిపినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
గత రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న గంటా సుజనా, సీఎం రమేశ్‌తో కూడా చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే మరో పది రోజుల్లో గంటా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో పార్టీ శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి.. జెపి నడ్డా సమక్షంలో ఢిల్లీ వెళ్లి బిజెపి తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు టీడీపీని వీడారు. టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని పార్టీకి రాజీనామా చేసిని విషయం తెలిసిందే.