అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పరిపాటి. అలా వారిని చూస్తే.. అబ్బో చాలా వైరం ఉందే అనుకుంటాం. కానీ కొందరు నాయకులు తెరపైకే ఇలా కనిపిస్తారు. తెరవెనక వారీ దోస్తీ బలంగా ఉంటుంది. కలిసే వ్యాపారాలు సాగిస్తారు. గుంటూరులో సంచలనం సృష్టించిన గుట్కా వ్యాపారంలోనూ ఈ కోణం ఉందట.
ఆ మధ్య గుంటూరు జిల్లాలో బయటపడిన గుట్కా మాఫియాలో మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇన్నాళ్లూ అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే బంధువు పేరు ఈ వ్యాపారంలో బలంగా వినిపించింది. గుట్టుచప్పుడు కాకుండా పెట్టిన గుట్కా తయారీ కేంద్రంపై అర్బన్ పోలీసులు దాడి చేయడంతో ఎక్కడివారు అక్కడే గప్‌చుప్ అయ్యారు. కాకపోతే అధికారపార్టీలో ఈ అంశంపై రచ్చ రచ్చే అయిందట. ప్రభుత్వం గుట్కా అమ్మకాలను నిషేధించినా.. అధికారం ఉన్నాం తమను ఎవరూ ఏం చేయలేరన్న దీమానో ఏమో కానీ ఏకంగా ఓ ప్రజాప్రతినిధి పేరున ఉన్న గోడౌన్‌ను లీజుకు తీసుకుని మరీ తయారీ మొదలుపెట్టేశారు.
ఇంత వరకూ బాగానే ఉన్నా.. గుట్కా తయారీ కేంద్రం ఎవరిదో తెలియక దాడులు చేసి.. నాలుక కర్చుకున్న పోలీసులు.. తర్వాత పనిని రెండో కంటికి తెలియకుండా ముగించేశారు. ఇదంతా నాణేనికి ఓవైపు మాత్రమే. రెండో వైపు పెద్ద కథే ఉందట. గుట్కా వ్యాపారం ప్రారంభించిన అధికార పార్టీ ఎమ్మెల్యే బంధువు.. టీడీపీ నేతల నుంచి కూడా పెట్టుబడులు పెట్టించారట. గుంటూరుకు చెందిన టీడీపీ ప్రముఖుడొకరు ఇందులో ఉన్నట్లు సమాచారం. ఈజీ మనీ వస్తున్నప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా వైసీపీ, టీడీపీ నాయకులు గుట్కా విషయంలో గుట్టుచప్పుడు కాకుండా ఒక్కటయ్యారట.
ఈ వ్యాపారంలో ఆరితేరిన ఉమా అనే వ్యక్తి సాయంతో గుట్కాను తయారు చేస్తే.. మార్కెటింగ్‌కు రాజారెడ్డి, రెడ్డిపాలెం సుబ్బారావులు చేసే విధంగా ఒప్పందం కుదిరిందట. ఆ తర్వాత తయారీ ముఠాల మధ్య తలెత్తిన వర్గపోరుతో విషయం పోలీసు చెవిన పడటం.. దాడి చేసి.. సీన్ చేయడం చకచకా జరిగిపోయాయి. తమ బ్రాండ్ గుట్కాలనే అమ్మాలని ఒత్తిడి చేయడం.. మాట వినని వారిపై పోలీసులకు చెప్పి కేసులు పెట్టించడం దుమారం రేపింది. ఈ వివాదం వల్లే ఎమ్మెల్యే బంధువు చేపట్టిన గుట్కా తయారీ కేంద్రం వెలుగులోకి వచ్చింది. అయితే ఆదిలోనే వ్యాపారం బెడిసి కొట్టడంతో ఇందులో పెట్టిన పెట్టుబడులను వెనక్కి ఇవ్వాలని సదరు అధికార పార్టీ ఎమ్మెల్యే బంధువును.. టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారట. కానీ.. ఎమ్మెల్యే బంధువు ‘పవర్’ఫుల్ ఎత్తుగడల ముందు టీడీపీ నేతల పప్పులు ఉడకలేదట. దీంతో మింగలేక కక్కలేక అన్నట్లుగా ఉండిపోయారట తెలుగుదేశంపార్టీ నాయకులు.
ఈ విషయంలో మరీ ఒత్తిడి చేస్తే టీడీపీ నేతకు చెందిన ఇతర వ్యాపారాలను, బినామీ యవ్వారాలను ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు ఉప్పందించి దాడులు చేయిస్తామని బెదిరించారట ఎమ్మెల్యే బంధువు. ఇప్పటికే ఆ టీడీపీ నేతపై ఐటీ దాడులు జరిగి ఉండటంతో.. ఆయన సైలెంట్ అయ్యారట. ఈ విషయమే ఇప్పుడు గుంటూరు రాజకీయాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది.