ఏపీలో విపక్ష టీడీపీకి మరో షాక్ తగిలేందుకు రెడీగా ఉందా ? ఓ సీనియర్ నేత పార్టీని వీడేందుకు రెడీగా ఉన్నారా ? ఆయన ఇప్పటికే తమ కుటుంబానికి ప్రయార్టీ లేకపోతే పార్టీ మారతానని అల్టిమేటం కూడా జారీ చేశారా ? అంటే అవుననే టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టీడీపీ సీనియర్ నేత, సీనియర్ పార్లమెంటేరియన్ రాయపాటి సాంబశివరావు కొద్ది రోజులుగా టీడీపీలో ఉక్కపోతతో ఉంటున్నారు. గత ఎన్నికలకు ముందు నుంచే రాయపాటి చంద్రబాబుపై గుస్సాతో ఉన్నారు. తన కుమారుడు రాయపాటి రంగారావు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు ఎంతో కష్టపడ్డారని.. అయితే ఎన్నికల వేళ గుంటూరు జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ సీటు ఇవ్వాలని అడిగినా బాబు పట్టించుకోలేదు.
ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత.. కోడెల శివప్రసాదరావు మృతి చెందడంతో సత్తెనపల్లి లేదా మద్దాలి గిరి పార్టీ మారడంతో గుంటూరు వెస్ట్ సీటు అయినా వారసుడికి ఇప్పించుకోవాలని రాయపాటి విశ్వప్రయత్నాలు చేశారు. అయినా చంద్రబాబు జిల్లాలో ఖాళీగా ఉన్న బాపట్ల, గుంటూరు వెస్ట్, మాచర్ల సీట్లకు ఇన్‌చార్జ్‌లను నియమించి సత్తెనపల్లి విషయం మాత్రం తేల్చలేదు. ఇక తాజాగా తన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీపై దాడులు జరుగుతున్నా చంద్రబాబు లైట్ తీస్కోవడంతో రాయపాటి మరింత కాకతో రగులుతున్నారట.
ఇక రాయపాటికి కొద్ది రోజులుగా బీజేపీ నుంచి ఆహ్వానం ఉంది. ఇక ఆయన చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా లేరు. ఇప్పుడు కన్నాను ఆ పదవి నుంచి తప్పించారు. పైగా రాయపాటికి జాతీయ స్థాయిలో కూడా బీజేపీ నేతలతో విస్తృత పరిచయాలు ఉన్నాయి. గతంలోనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ స్వయంగా గుంటూరు వచ్చి రాయపాటి సాంబశివరావును కలవడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. అప్పుడు రాయపాటి బీజేపీ ఎంట్రీకి పార్టీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా అడ్డుపుల్ల వేశారని.. అందుకే ఆయన ఎంట్రీ ఆగిందన్న ప్రచారం జరిగింది.
ఇప్పుడు రాయపాటి చంద్రబాబు తన కండీషన్లకు ఓకే చెప్పకపోయినా.. తన వారసుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఏదో ఒక సీటు ఇవ్వకపోయినా పార్టీలో తాను ఉండను .. బయటకు పోతానని వార్నింగ్ కూడా ఇచ్చేశారట. బాబు ఇలాగే నానిస్తే రాయపాటి నేరుగా ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసుకుని అయినా పార్టీ మారాలని చూస్తున్నారట. అదే జరిగితే టీడీపీలో మరో వికెట్ పడినట్టే..!