టీవీల్లో సీరియల్స్ ఏ మాదిరిగా ఏళ్ల తరబడి సాగుతాయో….అలాగే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారం సాగుతున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ తరుపున ఎంపీగా గెలిచి, అదే పార్టీకి పెద్ద తలనొప్పి మాదిరిగా మారిన రఘురామకృష్ణంరాజు….జగన్ బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
సీఎంగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఏప్రిల్ నెలలో పిటిషన్ వేశారు. బెయిల్ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని, సీఎం హోదాలో జగన్ వివిధ కారణాలు చెబుతూ, కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని రఘురామ పిటిషన్‌లో ఆరోపించారు. ఇక ఈ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతూ, చివరికి ఆగష్టు 25కు తీర్పు వాయిదా పడింది. కానీ ఇప్పుడు కూడా జగన్ బెయిల్ రద్దుపై తీర్పు మరొకసారి వాయిదా పడింది. సెప్టెంబర్ 15కు తీర్పుని వాయిదా వేశారు.
అయితే ఈ బెయిల్ రద్దు విషయంలో తీర్పు ఎలా వస్తుందో తెలియదు గానీ, బెయిల్ రద్దు అయ్యి జగన్ మళ్ళీ జైలుకెళితే బాగుంటుందని కొందరు టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు గానీ, ఎక్కువమంది మాత్రం జగన్ జైలుకు వెళ్లకూడదనే కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఎలాగో వైసీపీనే అధికారంలో ఉంది కాబట్టి, జగన్ జైలుకెళితే భారతి లేదా ఇతర సీనియర్ నాయకుల్లో ఎవరోకరు సీఎం పీఠంలో కూర్చుంటారని తమ్ముళ్ళు చెబుతున్నారు.
అలాగే జగన్‌ని కక్షపూరితంగా అరెస్ట్ చేయించారని మళ్ళీ వైసీపీ సెంటిమెంట్ లేపుతుందని అప్పుడు ఆ పార్టీకే బెనిఫిట్ అవుతుందని, సెంటిమెంట్ ఉంటే ఏం అవుతుందో 2012 ఉపఎన్నికల్లో తేలిందని, అప్పుడు టీడీపీకి డిపాజిట్లు కూడా రాలేదని గుర్తు చేస్తున్నారు. కాబట్టి జగన్ బెయిల్ రద్దు అవ్వకపోతేనే బెటర్ అని, వచ్చే ఎన్నికల వరకు జగనే సీఎంగా ఉండాలని, అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత పెరిగి టీడీపీకి బెనిఫిట్ అవుతుందని అంటున్నారు. మరి చూడాలి ఈ బెయిల్ రద్దు ఎపిసోడ్‌లో ఇంకా ఎన్ని ట్విస్టులు వస్తాయో?