ఇప్పటి వరకు అమరావతి విషయంలో చాలా గుంభనంగా వ్యవహరించిన టీడీపీ మాజీ మంత్రి, మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు తాజాగా తన మనసులో మాటను దాచుకోలేక పోయారు. గతంలో ఏం జరిగిందో.. ఇకముందు ఏం జరుగుతుందో చెప్పుకొచ్చారు. ఎంతైనా.. `అమరావతి` తమ అంచనాలు దాటి అదృశ్యమయ్యే పరిస్థితి ఏర్పడిందనే దిగులు పెరిగిందో ఏమో..! మొత్తంగా నిన్నటికి నిన్న గవర్నర్ హరిచందన్‌కు రాసిన లేఖలో అమరావతి విషయంలో తాము సంపూర్ణంగా చేతులు ఎత్తేసినట్టుగా యనమల స్పష్టం చేశారు. అంతేకాదు, ఈ క్రమంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదాలు రేపేలా వ్యాఖ్యానించారు.
రాజధాని బిల్లుల వ్యవహారం కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి ఆస్కారం కల్పిస్తోందని, వాటిని రాష్ట్రపతి పరిశీలన కు పంపడమే ప్రస్తుతం గవర్నర్ ముందున్న ప్రత్యమ్నాయమని యనమల చేసిన వ్యాఖ్య వెనుక అంతరార్థం ఎక్కువగానే ఉంది. మామూలుగా అయితే రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదే. కాని రాష్ట్ర విభజన రాష్ట్ర పునర్‌వ్యవస్ధీకరణ చట్టం ప్రకారం జరిగింది. ఏపీ ఒక రాజధానిని ఏర్పాటు చేసుకోవాలని, దానికి కేంద్రం సాయం చేస్తుందని చట్టంలో పేర్కొన్నారు. దీనిని పార్లమెంటు ఆమోదించింది.
ఆ చట్టంలో పేర్కొన్న ఒక రాజధాని అన్నదానిని 3 రాజధానులుగా మార్చాలంటే మళ్ళీ పార్లమెంటు మాత్రమే ఆ చట్టానికి సవరణ చేయాలి… అని యనమల చెప్పుకొచ్చారు. మరి.. ఇంత వెసులుబాటు ఉన్నప్పుడు .. మండలిలో అడ్డంగితలు, రగడలు , తిప్పిపంపలేదని చెప్పడాలు.. గవర్నర్‌కు లేఖలు రాయడాలు ఇన్ని ఎందుకు? అనేది సామాన్యుల ప్రశ్న. ఇక, రాష్ట్రానికి రాజధానిని మార్చే అధికారం లేదు. ఆ చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో రాజధానిని ఎక్కడ పెట్టాలన్న అంశంపై పరిశీలన చేయడానికి కేంద్రం ఒక కమిటీని కూడా నియమించిందని యనమల చెప్పుకొచ్చారు.
మరి ఇన్ని అవకాశాలు ఉండగా.. యనమల అండ్ బాబు టీంలు.. ఇప్పుడు రగడ చేయడం అంటే.. అర్ధం లేదనే అనిపిస్తోంది. సో మొత్తంగా టీడీపీ డ్రామాలు ఇలా బయట పడ్డాయి. ఇదేవిషయాన్ని పార్టీ సీనియర్లు కూడా గుసగుసలాడుతున్నారు. యనమల ఇప్పటికైనా అసలు విషయం చెప్పారని అంటున్నారు. ఇదీ సంగతి!!