తాను జాతీయస్థాయిలో చక్రాలు గట్రా తిప్పానని చెప్పుకుంటారు చంద్రబాబు. అందులో భాగంగానో ఏమో కానీ… ఏపీలోనే అంతంతమాత్రంగా ఉన్న టీడీపీని జాతీయపార్టీ అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. వైకాపా కూడా ఈ విషయంలో మాటలవరకూ జాతీయపార్టీ అని చెప్పుకుంటూ ఫిక్సయ్యింది. అయితే… ఈ రెండు పార్టీలకూ అంతసీన్ లేదని ఈసీ చెప్పకనే చెప్పింది!
అవును… తెలుగుదేశం పార్టీని చంద్రబాబు అండ్ కో ఎంతమాత్రం జాతీయ పార్టీగా క్లైం చేసుకునే పరిస్థితి ఇకపై లేదు! ఎందుకంటే టీడీపీ కేవలం ప్రాంతీయ పార్టీ మాత్రమే అని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం గా ప్రకటించింది. తమ పార్టీకి ఆస్థాయి లేదన్న సంగతి బాబుకి కూడా తెలుసు… అయినా కూడా జాతీయ పార్టీగా ప్రకటించేసుకున్నారు. అక్కడితో ఆగారా… జాతీయ అధ్యక్షుడిగా తనను తాను నియమించేసుకున్న చంద్రబాబు… జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేశ్ నియమించేసుకున్నారు.
అక్కడితో అయినా ఆగారా అంటే… లేదు! టీడీపీ కమిటీల్లో రెండు రకాలు కమిటీలు వేసేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబు.. రాష్ట్ర అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడు ని ప్రకటించారు. అలాగే జాతీయ పార్టీకి – రాష్ట్ర పార్టీకి వేర్వేరుగా ప్రధాన కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీలు, ఉపాధ్యక్షులు, సభ్యులను కూడా చంద్రబాబు నియమించేశారు. ఈ మేరకు వేర్వేరుగా లెటర్ హెడ్లు కూడా ప్రింట్ చేసి ఉపయోగించుకుంటున్నారు.
అయితే ఈ విషయంలో… టీడీపీ – వైసీపీ ల మధ్య ఓ తేడా ఉంది. అదేమిటయ్యా అంటే… వైసీపీ కూడా తమది జాతీయపార్టీయే అని చెప్పుకుంటున్నా అది కేవలం చెప్పుకోవటానికి మాత్రమే పరిమితమైంది. టీడీపీ లాగా జాతీయ కమిటీలు – ప్రాంతీయ కమిటీలంటూ ప్రకటించలేదు.
ఈ లెక్కన ఏది ఏమైనా… పార్టీ సాధించిన ఓట్లు, సీట్లను బట్టే సదరు పార్టీ జాతీయ పార్టీయా లేకపోతే ప్రాంతీయ పార్టీయా అని కేంద్ర ఎన్నికల కమిషన్ డిసైడ్ చేస్తుందన్నమాట. ఈ ప్రాతిపదికన చూసుకుంటే… టీడీపీ – వైకాపాలు ప్రాంతీయ పార్టీలే! మరి ఈ విషయంలో… తమ తమ పార్టీల హోదాలు ఏంటో కేంద్ర ఎన్నికల సంఘం తేల్చేసిన తర్వాత కూడా… “జాతీయ అధ్యక్షుడు – జాతీయ ప్రధాన కార్యదర్శి” వంటి ముద్దుపేర్లతో పిలుచుకుంటామంటే… అది వారి విజ్ఞత!!