2014 ఎన్నికల సమయంలో టీడీపీతో నేరుగా దోస్తీ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అనంతరం అధికారికంగా విడాకులు తీసుకుని.. ప్రస్తుతం బిజేపీతో కలిసి ఉంటున్నారు! అయితే… ఏపీ బీజేపీతో జనసేనకు అంతగా ప్రయోజనం లేకపోయినా.. కేంద్రంలోని మోడీతో స్నేహం అవసరమో ఏమో కానీ… బీజేపీపై సెటైర్స్ వేస్తున్నా కానీ వదలడం లేదు! దీంతో… బీజేపీతో జనసేన రిలేషన్ పై స్పష్టత కోరే పనికి పూనుకుంది టీడీపీ!
అవును… బీజేపీతో దోస్తీ కోసం ఇంతకాలం చకోరపక్షిలా ఎదురుచూసిన టీడీపీ… ఇకపై ఆ ఆలోచనలు పెట్టుకోవద్దని ఫిక్సయినట్లుంది. ఎప్పుడో మోడీ చేయి అందిస్తాడని చూస్తూ కూర్చుంటే… ఇక్కడ ఏపీలో జగన్ ఉన్న కుర్చీలు లాగేస్తున్నాడని గ్రహించిందంట టీడీపీ! ఇందులో భాగంగా.. ఇకపైనైనా ఏపీ ప్రజల సమస్యలపై పోరాడాలని – మోడీకి వ్యతిరేకశక్తులతో గొంతు కలపాలని – జనాల్లోకి రావాలని ఫిక్సయ్యిందంట.
అందులో భాగంగా… ఈ నెల 27న రైతు సంఘాలు చేపట్టబోయే భారత్ బంద్ కు టీడీపీ పార్టీ సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటన ఇచ్చేసింది టీడీపీ. ఈ సందర్భంగా మైకందుకున్న టీడీపీ అధ్యక్షుడు… రైతులు వ్యతిరేకిస్తున్న చట్టాలపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని డిమాండ్ చేశారు. భారత్ బంద్ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నేతలు – కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గోవాలని పిలుపునిచ్చారు.
దీంతో… తాజాగా జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతిస్తూ… టీడీపీతో రహస్య స్నేహం చేస్తుందనే పేరు సంపాదించుకున్న జనసేన నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 27న రైతు సంఘాలు చేపట్టబోయే భారత్ బంద్ కు జనసేన మద్దతు ప్రకటిస్తుందా.. లేదా? అనే విషయంపై ఆ రెండు పార్టీల కేడర్లతో పాటు జనాలకు కూడా చాలా విషయాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఒకవేల.. జనసేన భారత్ బందులో పాల్గొంటున్నట్లు ప్రకటిస్తే… “మోడీ వద్దు – బాబే ముద్దు” అనే స్పష్టత పవన్ ఇచ్చినట్లవుతుంది! అలా కాకుండా… భారత్ బందులో పాల్గొనకపోతే… “జనం వద్దు – మోడీ ముద్దు” అని క్లారిటీ ఇచ్చినట్లవుతుంది! మరి పవన్ ఈ విషయాలపై ఎలాంటి స్పష్టత ఇస్తారో అని అటు జనసైనికులతోపాటు టీడీపీ కేడర్ కూడా తీవ్రంగా ఎదురుచూస్తున్నారు.