జిల్లాల పునర్విభజన పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పటిదాకా ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. జిల్లాల విభజన మంచిదా చెడ్డదా అన్నది అటుంచితే ఇంతవరకూ పసుపు పార్టీ తరఫున ఒక్కటంటే ఒక్క స్టేట్మెంట్ లేదు.13 జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్ననిర్ణయంపై చాలా చోట్ల అసంతృప్తతలు ఉన్నాయి. కానీ టీడీపీ అభ్యంతరాలేంటో ఇంతవరకూ తెలియడం లేదు.సీమ ప్రాంతంలో మాత్రం టీడీపీ కర్నూలు,కడప జిల్లాల విషయమై కాస్తో కూస్తో గొంతు వినిపించింది. అది కూడా పెద్ద పెద్ద నాయకులెవ్వరూ కాకుండా నియోజకవర్గ స్థాయిలో పనిచేసే ఇంఛార్జిలు కొంతలో కొంత ప్రజల తరఫున డిమాండ్ ను ప్రభుత్వానికి చేరవేసేందుకు పత్రికా ప్రకటనలు ఇవ్వడం కానీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కానీ చేశారు.మిగతా ప్రాంతాలలో అదీ లేదు.ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి రెండు అభ్యంతరాలు వినవస్తున్నాయి.
ఒకటి శ్రీకాకుళం పునర్విభజన అన్నది అశాస్త్రీయంగా ఉందని చెబుతున్నారు. రెండోది విజయనగరానికి సంబంధించి కొత్తగా 11 మండలాలతో ఏర్పాటు చేసిన బొబ్బిలి రెవెన్యూ డివిజన్ ను విజయనగరం జిల్లాలో కాకుండా, మన్యం జిల్లాలో (పార్వతీపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటైన)లో కలపాలని పబ్లిక్ నుంచి డిమాండ్ వస్తుంది.అదేవిధంగా చీపురుపల్లిని ప్రత్యేక రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
ఇక శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండగా ఒక ఎస్సీ స్థానం ఒక ఎస్టీ స్థానం ఉన్న నియోజకవర్గాలు లేకుండా పోయాయి. ఎస్సీ స్థానం రాజాం కాగా, ఎస్టీ స్థానం పాలకొండ. ఈ రెండూ కూడా ఇప్పుడు లేకుండా పోయాయి. రాజాం నియోజకవర్గం విజయనగరంలో కలిసిపోగా, పాలకొండ నియోజకవర్గం మన్యం (జిల్లా కేంద్రం : పార్వతీపురం) జిల్లాలో కలిసిపోయింది.దీంతో అటు విజయనగరం కానీ ఇటు శ్రీకాకుళం కానీ అవి తమ పరిధిలో ఇంతకాలం ఉన్న ఐటీడీఏలను కోల్పోయాయి. సీతంపేట ఐటీడీఏ పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉండేది. అదేవిధంగా పార్వతీపురం ఐటీడీఏ ఇప్పుడు విభజన కారణంగా విజయనగరం నుంచి మన్యం జిల్లాకు తరలిపోయింది. ఈ విధంగా రెండు జిల్లాలకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి.అదేవిధంగా విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏను కోల్పోయింది. ఇక్కడి ఐటీడీఏ పాడేరు జిల్లా కేంద్రంగా ఏర్పాటు కానున్న అల్లూరి సీతారామరాజు జిల్లాకు పోనుంది.దీంతో విశాఖ జిల్లా పరిధిలో ఐటీడీఏ అన్నది లేకుండా పోయింది. ఉత్తరాంధ్రలో ఐటీడీఏ ప్రాధాన్యం గురించి వేరేగా చెప్పక్కర్లేదు కానీ వీటిని వేర్వేరు జిల్లాలకు సర్దడం కారణంగా ఇప్పుడవి ఏ విధంగా పనిచేస్తాయో అన్న డైలమా ఉంది. వీటిపై చంద్రబాబుతోసహా మిగతా టీడీపీ నాయకులు మాట్లాడాలి.
జిల్లాలు ఏవయినా కానీ ఐటీడీఏ పరిధి మాత్రం అలానే ఉంచితే మేలు. అప్పుడు గిరిజన ప్రాంతాలు కాస్తో కూస్తో అభివృద్ధి చెందుతాయి. సీతం పేట ఐటీడీఏ లేని కారణంగా శ్రీకాకుళం జిల్లాలలో దాదాపు ఎనిమిది మండలాలపై ప్రభావం స్పష్టంగా ఉంటుంది. ఈ మండలాల్లో ఐటీడీఏ కొద్దో గొప్పో పనులు చేపట్టేది. ఇప్పుడు ఏ విధంగా అవి ముందుకు సాగుతాయో! ముఖ్యంగా పాతపట్నం, కొత్తూరు, భామిని, మెళియా పుట్టి, సీతంపేట,పలాస, మందస, వజ్రపుకొత్తూరు వంటి మండలాలపై తీవ్ర ప్రభావం ఉండనుంది. మరి! జిల్లా మారిపోవడంతో ఐటీడీఏ ఏ విధంగా తన పరిధిని మార్చుకుంటుందని? కనుక వీటన్నింటిపై టీడీపీ మాట్లాడాలి. కానీ మాట్లాడడం లేదు ఇదే విచారకరం.