దేవాలయాల దాడుల పేరుతో టీడీపీ కమలానికి కన్నుగొడుతుందా ?

-

రాష్ట్రంలో జరుగుతున్న దేవాలయాలు.. హిందూ దేవతల విగ్రహాల విషయంలో జరుగుతున్న వరుస దాడుల విషయంలో టీడీపీ పొలిట్ బ్యూరో కీలక నిర్ణయం తీసుకుందా. ఏపీలో దేవాలయాల పరిస్థితి.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై జాతీయ స్థాయిలో చర్చకు పెట్టి కమలానికి కన్ను గీటే ప్రయత్నలో టీడీపీ అధినేత ఉన్నారా ? అన్నది టీడీపీ విస్తృత స్థాయి సమావేశం తర్వాత సైకిల్ పార్టీలో ఈ అంశం పైనే చర్చ జరుగుతుంది.


కొత్త కమిటీలు వేసిన తర్వాత టీడీపీ తొలి సారి పొలిట్ బ్యూరో భేటీ నిర్వహించింది. ఈ భేటీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ మతపరమైన చర్చ జరిగింది. దేవాలయాలు.. దేవతా మూర్తుల విగ్రహాల ధ్వంసం అవుతున్న ఘటనలపై సుదీర్ఘంగా చర్చించారు. సుమారు 125కు పైగా ఈ తరహా ఘటనలు జరిగినట్టు జాబితాను సిద్దం చేసింది టీడీపీ. అయితే వీటిల్లో ఏ అంశంలోనూ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించలేదని.. ఎవరి మీదా చర్యలు తీసుకోలేదనే అభిప్రాయం పొలిట్ బ్యూరోలో వ్యక్తం అయింది.

రాష్ట్రంలో దేవాలయాల కేంద్రంగా జరుగుతున్న వరుస పరిణామాలను జాతీయ స్థాయిలో ఫోకస్ వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని భావించింది టీడీపీ పొలిట్ బ్యూరో. ఈ క్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం దృష్టికి.. ప్రత్యేకించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లే ఆలోచన చేశారు పొలిట్ బ్యూరో సభ్యులు. అలాగే అమిత్ షా వద్దకు పార్టీ ప్రతినిధి బృందాన్ని పంపాలనే సూచనలు వచ్చాయి. ఈలోగా ఇదే అంశంపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ బృందం కలవాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయించారు.

టీడీపీ నేతల మాట తీరులో కూడా మార్పు కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. గతంలో ముఖ్యమంత్రి మీద ఎన్నడూ లేని విధంగా కామెంట్లు చేశారు. సీఎం సహా హోం మంత్రి, డీజీపీలు క్రైస్తవులంటూ సంచలన కామెంట్లు చేశారు పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు. ఈ భేటీలో టీడీపీ నేతలపై దాడులు.. హత్యలపై చర్చించారు. ప్రభుత్వం.. అధికార పార్టీ నేతలు టీడీపీ నేతలపై దాడులను ప్రొత్సహిస్తున్నారని పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. వైసీపీ బాధితులకు టీడీపీ అధినాయకత్వం కచ్చితంగా అండగా ఉంటుందని పొలిట్ బ్యూరో భరోసానిచ్చింది.

దేవాలయాల దాడుల పేరుతో టీడీపీ ఢిల్లీ లెవల్ లో ఫోకస్ చేయడం..అమిత్ షా కలిసే ఆలోచన చేయడంతో కమలానికి కన్ను గీటే ప్రయత్నంలో టీడీపీ ఉందా అన్న చర్చ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news