రాజకీయాల్లో ఎత్తు వేసేవాడు ఒకడుంటే.. దానికి పై ఎత్తు వేసేవాడు ఇంకొకడుంటాడని అంటారు. అచ్చు.. ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఇలానే జరిగింది. రాజధాని విషయంలో మార్పుచేయరాదని, అమరావతినే కొనసాగించాలని, దేశంలో ఏరాష్ట్రానికీ కూడా మూడు రాజధానులు లేవని టీడీపీ అధినేత చంద్రబాబు ఆయ న పరివారం కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఉద్యమాలకు దిగాయి. దాదాపు పాతిక రోజులుగా ఇదే విషయంపై అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం చేస్తున్నాయి. ఇక, ఆఖరి ప్రయత్నం గా చంద్రబాబు అమరావతిని సమర్ధిస్తున్న జిల్లాలకు తిరుగుతున్నారు. రోడ్లపై జోలె పడుతున్నారు.
దీంతో ప్రజల్లోనూ ఒక విధమైన చర్చనడుస్తోంది. దీంతోఅధికార వైసీపీ అంతర్మథనంలో పడిపోయింది. రాజధాని విషయంలో ఇంత యాగీ చేస్తున్న చంద్రబాబు టీంకు సరైన విధంగా కౌంటర్ ఇవ్వాలని భావించిన ప్రభుత్వానికి ఇదే ప్రాంతంలోని మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించారు. వాస్తవానికి ఈయనకు టీడీపీ నేతలు కరకట్ట కమల్ హాసన్ అని వ్యంగ్యంగా పేరు పెట్టుకున్నారు. అంటే, ఆయన మాటలే తప్ప చేసేది ఏమీలేదనివారు ప్రచారం చేస్తున్నారు.
దీంతో తాజాగా ఆళ్ల తన విశ్వరూపం చూపించారు. అదే రాజధాని ప్రాంతంలో వికేంద్రీకరణకు మద్దతుగా రైతులను కూడగట్టారు. రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరిగి, సమగ్ర అభివృద్ధి జరగాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆధ్వర్యంలో తాజాగా గుంటూరు జిల్లా పెనుమాక నుంచి తాడేపల్లి భారతమత విగ్రహం వారకు భారీ ర్యాలీ తలపెట్టారు. ర్యాలీలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అభివృద్ధి కావాలి.. వికేంద్రీకరణ జరగాలి అంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శించారు. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా నినాదాలు చేశారు.
దీనికి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భారీ ఎత్తున తరలి వచ్చిన రైతులు, మహిళలను చూసిన టీడీపీ తమ్ముళ్లు అవాక్కయ్యారు. వెంటనే ప్రెస్‌మీట్లు పెట్టి.. పోటా పోటీ ప్రదర్శనలు చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. మొత్తంగా ఆళ్ల ఇచ్చిన కౌంటర్‌తో టీడీపీ నాయకులు అవాక్కయ్యారనడంలో సందేహం లేదు.