గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ పోటీ ఎవరికి లాభం ?

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఒకప్పుడు టీడీపీదే హవా. అలాంటి పార్టీ కిందటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కచోటే గెలుపొందింది. గతంలో గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసింది టీడీపీ. అయినా ఒక్క కూకట్‌పల్లిలో మాత్రం టీడీపీ కార్పొరేటర్‌ గెలిచారు. కాకపోతే చాలాచోట్ల టీడీపీ అభ్యర్థులు రెండోస్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఏపీలో ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పూర్తిస్థాయిలో గ్రేటర్ ఎన్నికల పై ఫోకస్‌ పెట్టబోతున్నారు. ఇప్పుడు 150డివిజన్లలోనూ సైకిల్ పార్టీ పోటీకి సిద్ధపడుతోంది. అయితే సైకిల్ సవారీతో ఏ పార్టీ ఓట్లకు గండి పడుతుంది ఎవరికి లాభం.. ఎవరికి నష్టం అన్నదానిపై లెక్కలు వేస్తున్నాయి ప్రధాన రాజకీయపార్టీలు…

తెలంగాణలో ఉనికి కోల్పోతున్న టీడీపీకి జీహెచ్ఎంసీ పరిధిలో ఇంకా ఎంతో కొంత ఓటు బ్యాంకు ఉందని నాయకులు భావిస్తున్నారు. సెటిలర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఇప్పటికీ టీడీపీ బలంగా ఉందని చెబుతున్నారు. కాకపోతే వాటిని ఓట్ల రూపంలో రాబట్టుకోలేకపోతున్నామని పార్టీ వర్గాల్లో తరచూ చర్చ జరుగుతుంది. దీంతో తెలంగాణలో టీడీపీ బలోపేతానికి సమయం కేటాయిస్తున్నారు చంద్రబాబు. గ్రేటర్‌ ఎన్నికల ద్వారా పార్టీని పట్టాలెక్కించాలనే ప్రయయత్నం చేస్తున్నారాయన.

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమవుతున్న టీడీపీ… పార్టీ ఓటు బ్యాంకును కాపాడుకోవడంతోపాటు పరువు నిలుపుకొనేలా డివిజన్లు గెలుపొందాలని లెక్కలు వేస్తుందట. టీడీపీ నేతల అంచనాలు బాగానే ఉన్నా.. మొత్తం 150 డివిజన్లలో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉన్నారా అన్నదే అసలు సమస్య. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికలలో పోటీ చేసిన ప్రతిసారీ టీడీపీ గెలవలేకపోయినా.. ఓట్లను మాత్రం చీల్చింది. గత గ్రేటర్ ఎన్నికలను పరిగణనలోకి తీసుకుంటున్న నాయకులు.. గ్రేటర్‌ పరిధిలో 16 శాతం ఓట్లు టీడీపికి ఉన్నాయని అనుకుంటున్నారు.

2018అసెంబ్లీ ఎన్నిల్లో టీడీపీ 13 చోట్ల పోటీ చేసింది. అందులో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పోటీ చేసిన ఆరుచోట్ల రెండోస్థానంలో నిలిచింది టీడీపీ. ఈ లెక్కలు మళ్లీ బయటకు తీసిన విశ్లేషకులు.. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు గెలుస్తారో లేదో కానీ.. ఇతర పార్టీలపై కచ్చితంగా ఆ ఎఫెక్ట్‌ ఉంటుందని అనుకుంటున్నారట. ఇది అల్టిమేట్‌గా అధికార పార్టీకి లాభం చేకూరుస్తుందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.