ధర్మశాల వేదికగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్ పై ఇన్నింగ్స్ 64 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది.ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ 218 పరుగులు చేయగా ఇండియా 477 పరుగులతో దీటుగా బదులిచ్చింది. 259 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 195 రన్స్ కే కుప్పకూలింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. దీంతో టెస్టు సిరీస్ భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. చివరి టెస్టులో ఆధిపత్యం కనబరిచిన ఇండియా కేవలం మూడు రోజుల్లోనే ఆటను ముగించేసింది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టేబుల్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే…సిరీస్ కైవసం చేసుకున్న టీమ్ ఇండియాని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభినందించారు. ‘మొదటి టెస్టులో ఓడిపోయినప్పటికీ టీమ్ ఇండియా అద్భుతంగా పుంజుకుని 4-1తో విజయ తీరాలకు చేరిందని తెలిపారు. టీమిండియా ఆటగాళ్లు సిరీస్ మొత్తం జట్టు తమకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇంగ్లండ్ పై తిరుగులేని విజయంలో కుల్దీప్, అశ్విన్ అద్భుత ప్రదర్శనలే కీలక పాత్ర పోషించాయి’ అని ట్వీట్ చేశారు.