తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన నేపథ్యం లో ఇవాళ బీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ పనిదినాలు మరియు చర్చించాల్సిన అంశాల పై బీఏసీ చర్చించింది. అక్టోబర్ 5 వరకు అసెంబ్లీ నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఈ అసెంబ్లీ పని దినాల పై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది తెలంగాణ సర్కార్.
అయితే.. తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పూర్తి గా వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. కేవలం పది రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడమేంటని ప్రశ్నించింది కాంగ్రెస్. ఈ సారి జరిగే అసెంబ్లీ సమావేశాలను 20 రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే… ఈ డిమాండ్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు.
కాగా.. అంతకుముందు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన… తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన తర్వాత.. తొమ్మది మంది మాజీ ఎమ్మెల్యేల మృతికి సభ సంతాపం తెలిపింది. అనంతరం.. మాజీ ఎమ్మెల్యేల మృతి పట్ల సంతాప తీర్మానం పెట్టింది అసెంబ్లీ.