ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం. ఇకపై ప్రతి ఏడాది నియామకాల కోసం జాబ్ క్యాలెండర్ తయారు చేయాలని అలాగే నూతన జిల్లాల వారీగా పోస్టులు కేటాయించాలని తెలంగాణ మంత్రి వర్గం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆటో 50 వేల ఉద్యోగాల భర్తీపై ఇవాళ క్యాబినెట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
అలాగే ప్రభుత్వ గురుకులాలు, విద్యా సంస్థల్లో స్థానిక రిజర్వేషన్లు కేటాయించాలని నిర్ణయించింది. ఆయా నియోజకవర్గాల విద్యార్థులకు 50శాతం సీట్లు కేటాయించాలని సీఎం కేసీఆర్ నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో స్థానిక విద్యార్థులకు ఆయా విద్యాలయాల్లో మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతున్నది.
సమావేశంలో పల్లె, పట్టణ ప్రగతి పురోగతిపై పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు కేబినెట్‌కు నివేదికలు సమర్పించాయి. నెలలోపు వైకుంఠధామాలు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.అన్ని గ్రామాల్లో వీధి దీపాల కోసం ఏర్పాట్లు చేయాలని, ఇందుకు మూడోవైర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ శివారు పురపాలికల్లో నీటి సమస్యపై కేబినెట్‌లో చర్చ జరగ్గా.. తక్షణమే అదనంగా రూ.1,200 కోట్లను ముఖ్యమంత్రి మంజూరుచేశారు. కాగా ఇక రేపు మరోసారి తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది.