కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ కార్యక్రమం దేశవ్యాప్తంగా చురుగ్గా కొనసాగుతోంది. 18 ఏళ్లకు పైబడిన వారికి టీకాలను వేస్తున్నారు. అయితే టీకాలను వేయించుకునే వారికి అనేక రకాల సందేహాలు వస్తున్నాయి. మరి వాటికి నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కోవిడ్ ఫుల్ వ్యాక్సినేషన్ అంటే ఏమిటి ?
ప్రస్తుతం దేశంలో రెండు రకాల వ్యాక్సిన్లను ఇస్తున్నారు. ఆ వ్యాక్సిన్లకు రెండు డోసులను తీసుకోవాల్సి ఉంటుంది. రెండో డోసు వేసుకున్న తరువాత రెండు వారాలకు శరీరంలో యాంటీ బాడీలు బాగా ఉత్పత్తి అవుతాయి. దీంతో కోవిడ్ నుంచి పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుంది. అందుకని ఆ సమయం గడిస్తే ఫుల్ వ్యాక్సినేషన్ తీసుకున్నట్లు లెక్క.
2. పూర్తి స్థాయిలో టీకాలను తీసుకుంటే రక్షణ లభిస్తుందా ?
పూర్తి స్థాయిలో.. అంటే రెండు డోసుల టీకాలను తీసుకున్న వారికి కోవిడ్ రిస్క్ తక్కువే. అలా అని పూర్తి రక్షణ ఉంటుందని చెప్పలేం. కానీ వైరస్ నుంచి రక్షణ మాత్రం లభిస్తుంది.
3. టీకాలు తీసుకున్నవారు కోవిడ్‌ను వ్యాప్తి చేస్తారా ?
అవును. వ్యాప్తి చేస్తారు. కానీ అందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
4. టీకాలను రెండు డోసులు తీసుకున్న తరువాత కూడా మాస్క్‌లను ధరించాలా ?
అవును.. ధరించాల్సిందే.. దేశవ్యాప్తంగా ప్రజలందరికీ టీకాలు వేస్తేనే గానీ మాస్కులను తీయడానికి లేదు. కనుక టీకా రెండు డోసులు తీసుకున్నా మాస్కులను ధరించాల్సిందే.
5. రెండు డోసుల టీకా తీసుకున్న వారు విదేశాలకు వెళ్లవచ్చా ?
వెళ్లవచ్చు. కాకపోతే అన్ని దేశాలు ప్రస్తుతం భారత్ నుంచి రాకపోకలను అనుమతించడం లేదు. కొన్నే అనుమతిస్తున్నాయి. కనుక వివరాలు తెలుసుకుని ప్రయాణించవచ్చు. ఇక ప్రయాణాలు చేసేవారు రెండు డోసుల టీకా తీసుకున్నట్లు ధ్రువపత్రాన్ని కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది.