విద్యుత్ బకాయిలు, విభజన సమస్యలు, నీటిపారుదల అంశాలపై దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర వాదనలు బలంగా వినిపించాలని రాష్ట్ర బృందాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రేపు కేరళ రాజధాని తిరువనంతరపురం వేదికగా కౌన్సిల్ 30వ సమావేశం జరగనుంది. విద్యుత్ బకాయిలు, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు, విభజన హామీలు సమావేశంలో ప్రస్తావనకు రానున్నాయి. హోంమంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో రాష్ట్ర బృందం కౌన్సిల్ సమావేశానికి హాజరుకానుంది.
విద్యుత్ బకాయిల అంశం చర్చకు రానుంది. తెలంగాణ డిస్కంల నుంచి 6700 కోట్లు రావాలని ఏపీ చెపుతుండగా ఆ మొత్తాన్ని నెల రోజుల్లోగా చెల్లించాలంటూ కేంద్ర విద్యుత్ శాఖ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏపీ నుంచి తమకు రూ.12వేల కోట్ల విద్యుత్ బకాయిలు రావాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీంతో కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం మరోమారు ప్రస్తావనకు రానుంది. అలాగే రాష్ట్రానికి సంబంధించి నీటిపారుదల సంబంధిత అంశాలు సహా విభజన వివాదాలు, సమస్యలు సమావేశంలో ప్రస్తావనకు రానున్నాయి.