టీ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జి.. మాణికం ఠాగూర్‌ స్థానంలో మాణిక్​రావు ఠాక్రే

-

తెలంగాణ కాంగ్రెస్​లో పెనుమార్పు చోటుచేసుకుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మాణిక్​రావు ఠాక్రే నియమితులయ్యారు. ఇప్పటివరకు రాష్ట్ర బాధ్యతలు చూస్తున్న తమిళనాడు నేత మాణికం ఠాగూర్‌ను తప్పించి ఆ స్థానంలో మహారాష్ట్ర సీనియర్‌నేత మాణిక్‌రావు ఠాక్రేను నియమించారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఏఐసీసీ ఉత్తర్వులు జారీచేసింది.

రెండేళ్లకు పైగా తెలంగాణ ఇన్‌ఛార్జిగా ఉన్న ఠాగూర్‌ ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పినట్లు వింటూ  సీనియర్లను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ అధిష్ఠానానికి ఫిర్యాదులు రావడంతో ఆయన్ను తప్పించినట్లు సమాచారం. ఇటీవల కొందరు సీనియర్‌ నేతలు ఖర్గేను కలిసి రాష్ట్ర పార్టీ వ్యవహారాలను వివరించినప్పుడు త్వరలో అన్నింటినీ సరిదిద్దుతానని హామీ ఇచ్చారు. అందులోభాగంగానే ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది.

తెలంగాణ నుంచి తప్పించిన ఠాగూర్‌కు గోవా ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు గోవా, తమిళనాడు, పుదుచ్చేరిల ఇన్‌ఛార్జిగా ఉన్న దినేష్‌గుండూరావు నుంచి గోవా బాధ్యతలు తప్పించారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై ఖర్గే కూడా ప్రత్యేక దృష్టిసారించడంతో త్వరలోే దిల్లీలో లేదా హైదరాబాద్‌లో పీసీసీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారని విశ్వసనీయ సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news