అప్పుడే ‘ చేయి ‘ ఎత్తేస్తే ఎలాగమ్మా ..?

-

గతంతో పోలిస్తే కాస్తోకూస్తో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఆ పార్టీలో నిరుత్సాహం కనిపిస్తోంది. అసలు తెలంగాణలో ఉనికి లేని పార్టీగా, బిజెపి ఆకస్మాత్తుగా బలం పుంజుకుని, టిఆర్ఎస్ కు పోటీ ఇచ్చే స్థాయికి వెళ్లడం… కాంగ్రెస్ ను పూర్తిగా పక్కకు నెట్టడం, ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు మూడో స్థానమే అనే గుసగుసలు మొదలవడం వంటి వ్యవహారాలు ఆ పార్టీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. రెండోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పూర్తిగా నిరాశ నిస్పృహల్లో ఉన్నట్టుగా కనిపించినా, ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాలు, ఆ పార్టీకి కలిసి వచ్చాయి. ముఖ్యంగా టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి వంటివారు కాంగ్రెస్ లో ఉత్సాహం తీసుకువచ్చేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేశారు.
అయితే ఇక్కడే కాంగ్రెస్ కు  అసలు సమస్య ఎదురైంది. మొదటి నుంచి గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు గా ఉన్న కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఇప్పటికీ మారలేదు. పూర్తిగా పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో, ఆ పార్టీ నేతలు ఐకమత్యంగా, పార్టీని ముందుకు తీసుకువెళ్లే విషయంపై దృష్టి సారించకపోవడం, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయాల్సిన నాయకులు, సొంత పార్టీ నాయకులకు క్రెడిట్ దక్కకుండా చేసేందుకు ప్రయత్నించడం, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు , విమర్శలు చేసుకోవడం ఇలా ఎన్నో కారణాలు తెలంగాణలో కాంగ్రెస్ బలహీన పడేలా రాజకీయ ప్రత్యర్థులపై పోరాటం చేసేందుకు అవకాశం లేకుండా పోవడానికి కారణం అయ్యింది.
కాంగ్రెస్ బలహీనతలను ఆసరా చేసుకుని , టిఆర్ఎస్ బీజేపీలు  మరింత బలోపేతం అవుతున్నాయి. ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గం వరకు చూసుకుంటే , టిఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణం సంభవించగానే అక్కడ బిజెపి తరఫున రఘునందన్ రావు రెండో రోజే ప్రచారం మొదలుపెట్టారు. బీజేపీ తరపున ఖచ్చితంగా సీటు వస్తుందనే నమ్మకం ఆయన లో ఎక్కువగా ఉండడంతో అదే ధీమాతో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 2018 ఎన్నికల్లో ఓటమి చెందినా రఘునందన్ రావు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండడం వంటివి బాగా కలిసి వచ్చాయి. మిగతా పార్టీలన్నీ ఎన్నికల ప్రచారం పై దృష్టి సారించ గా కాంగ్రెస్ లో  చివరకు అభ్యర్థి ఎవరనేది క్లారిటీ లేకపోవడం వంటివి ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇక కొత్తగా కాంగ్రెస్ ను  బలోపేతం చేసేందుకు వచ్చిన, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ కాంగ్రెస్ బలోపేతానికి, ఆ పార్టీ నాయకుల్లో సఖ్యత కుదిర్చేందుకు ప్రయత్నిస్తారని అంత ఆశించినా,  పెద్దగా ప్రయోజనం అయితే కనిపించలేదు.
ఇక దుబ్బాక సంగతి అలా ఉంటే , గ్రేటర్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పుంజుకునేలా కనిపించకపోవడంతో ఆ పార్టీ నాయకుల్లో అప్పుడే నిరుత్సాహం అలుముకుంది. కాస్తో కూస్తో , రేవంత్ వంటి వారు హడావుడి చేస్తున్నా, మిగతా నాయకులు నుంచి పెద్దగా సహకారం రాకపోవడం, ఇలా ఎన్నో ఎన్నెన్నో కారణాలు కాంగ్రెస్ కు శాపంగా మారాయి.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news