బోనాల సందడి తెలంగాణ రాష్ట్రం తో పాటు… విజయవాడ నగరంలోనూ మొదలైంది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై… కొలువు దిరిన బెజవాడ కనకదుర్గమ్మ కు తెలంగాణ బంగారు ఆదివారం మధ్యాహ్నం సమర్పించారు. హైదరాబాద్ భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాలు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించింది.
ఈ సందర్భంగా దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ పూజారులు. మీరాలంమండి గుడి చైర్మన్ గోపాల్ ఆధ్వర్యంలో పాతబస్తీకి చెందిన భక్తులు కూడా అమ్మవారికి బోనాలు నివేదించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వీరికి ఆహ్వానం పలికారు.
ఉదయం 10గంటల సమయంలో బ్రాహ్మణ వీధి జమ్మి దొడ్డి వద్ద పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా ఘాట్ రోడ్డు నుంచి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం వరకు కళాకారులతో బోనాల జాతర ఊరేగింపు జరిగింది. ఈ నేపథ్యంలో బెజవాడ వీధుల్లో బోనాల సందడి నెలకొంది. ఈ సాంప్రదాయం గత 12 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తోందని మీరాలంమండి ఆలయ చైర్మన్ గోపాల్ పేర్కొన్నారు. తెలుగు ప్రజలు సుఖశాంతులతో ఉండాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.