తెలంగాణాలో కరోనా వైరస్ కట్టడి అవుతుంది అనుకునే తరుణంలో తెలంగాణా ప్రభుత్వానికి ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్ళిన వాళ్ళ వ్యవహారం ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. వారిని గుర్తించడానికి తెలంగాణా ప్రభుత్వం ఇప్పుడు తీవ్రంగా కష్టపడుతుంది. ఈ ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారిలో ఆరుగురు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీనితో తెలంగాణా సర్కార్ ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉంది.
చీమ చిట్టుక్కుమనకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే పరిస్థితి మాత్రం ఏదోక రూపంలో ఆందోళనగా మారుతుంది. ఢిల్లీలో మార్చి 13-15 తేదీల్లో నిజాముద్దీన్‌లో జరిగిన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు బయటకు వచ్చాయి. మొత్తం 75 దేశాల నుంచి 8000 మంది అక్కడ మత ప్రార్ధనలకు వచ్చారు. ఆ ప్రార్ధనలలో తెలంగాణా నుంచి 280 మంది పాల్గొన్నారని అధికారులు గుర్తించారు. ఇప్పుడు వారి జాబితాను తెలంగాణా ప్రభుత్వం బయటకు తీసినట్టు తెలుస్తుంది.
ఎక్కడి ఎక్కడి నుంచి వెళ్ళారు అనేది ఇప్పుడు వివరాలు బయటకు తీసారు. హైదరాబాద్ 186, నిజామాబాద్ 18, మెదక్ 26, నల్గొండ 21, ఖమ్మం 15, అదిలాబాద్ 10, రంగారెడ్డి 15, వరంగల్ 25, కరీంనగర్ 17, మహబూబ్‌నగర్ 25, బైంసా 11, నిర్మల్ 11, ఖమ్మం 9, కొత్తగూడం 4, మణుగూరు 6 మంది వెళ్ళారని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపధ్యంలో తెలంగాణా సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఎవరు అయితే ప్రార్ధనలకు వెళ్ళారో వారు అందరూ వచ్చి అధికారులను కలవాలని కోరింది. ఉచితంగా చికిత్స అందిస్తామని స్పష్టం చేసింది. ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది.