ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే హుజురాబాద్‌లో గులాబీ జెండా ఎగురవేసేందుకుగాను అధికార టీఆర్ఎస్ పార్టీ ‘దళిత బంధు’ స్కీమ్ పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్‌లో లాంచ్ చేసింది. స్వయంగా సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి వచ్చి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ప్రకారం ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వనుంది సర్కార్.
అయితే తాజాగా ఈ దళిత బంధు పథకానికి సంబంధించి… కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎస్సీ అభివృద్ధి మరియు సంక్షేమ శాఖ అదనపు విధివిధానాలను ప్రకటించింది ప్రభుత్వం. లబ్ధిదారులకు కేటాయించే 10 లక్షల నిధులతో సాధ్యమైతే రెండు యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.
అలాగే ఇద్దరు లేదా ఎక్కువ మంది పెద్ద యూత్ ను ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. యూనిట్ల ఎంపిక పూర్తయ్యాక ఆయా రంగాల్లో లబ్ధిదారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. రెండు వారాల నుంచి ఆరు వారాల లోపు శిక్షణ ఉంటుంది. అవసరమైతే లబ్ధిదారులను ప్రభుత్వమే వివిధ ప్రాంతాల్లో పర్యటన కూడా తీసుకు వెళ్లనుంది. ఆయా రంగాల్లో విజయవంతమైన వారితో లబ్ధిదారులకు అవగాహన కల్పించనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.