తెలంగాణ ప్రభుత్వం ప్ర‌క‌టించిన నూతన మద్యం విధానం..

-

వైన్ షాప్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నూతన మద్యం విధానానికి సంబంధించి గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నవంబరు 1 నుంచి కొత్త మద్యం పాలిసీ అమల్లోకి రానుంది. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి 2021 అక్టోబర్ 31 వరకు నూతన మద్యం విధానం అమల్లో ఉండనుంది. రాష్ట్రంలో 2216 మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిలో దుకాణాదారుల ఎంపిక జరగనుంది. అలాగే జనాభా ప్రాతిపదికన లైసెన్స్‌ ఫీజులు ఖరారు చేసింది. మద్యం షాపులు తెరచి ఉంచే సమయాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే గతంలో ఉన్న 4 స్లాబులను 6 స్లాబులుగా ప్రభుత్వం మార్చింది. 5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ. 50 లక్షల లైసెన్స్‌ ఫీజు. 5 వేల నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు.. 50 వేల నుంచి లక్ష జనాభా ప్రాంతాల్లో రూ.60 లక్షలు.. లక్ష జనాభా నుంచి 5 లక్షల లోపు ఉన్న ప్రాంతాలకు రూ.65 లక్షలు..5 లక్షల నుంచి 20 లక్షలలోపు జనాభా ప్రాంతాలకు రూ.85 లక్షలు.. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.10 కోట్ల లైసెన్స్‌ ఫీజుగా ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణాల కోసం నాన్‌ రిఫండబుల్‌ దరఖాస్తు ఫీజును రూ.2 లక్షలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news