గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ చట్టం అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య ఉషాబాయి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. రాజాసింగ్‌పై పీడీ చట్టం అమలు చేయడంపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని హోంశాఖ కార్యదర్శికి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌కు నోటీసులు ఇచ్చింది. అనంతరం ఈ కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
తన భర్తను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారంటూ రాజాసింగ్ భార్య ఉషాబాయి దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారించింది. పోలీసులు నమోదు చేసిన ఓ కేసులో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిందని.. మిగతా రెండు పాత కేసుల్లో నోటీసులకు సమయం కూడా ఇవ్వలేదని ఉషాబాయి పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆమె తరఫున న్యాయవాది ఈ విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నాలుగు వారాల్లోపు హోంశాఖ కార్యదర్శి, హైదరాబాద్ సీపీ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టు ఆ వివరాలను పరిశీలించనుంది.