ఆదివాసీల అటవీ హక్కుల చట్టం, నిబంధనల మేరకే పోడు భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ జరపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పోడు భూములకు పట్టాల పంపిణీపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభ రెడ్డి వేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.
పోడు భూములను క్రమబద్ధీకరించడం చట్ట విరుద్ధమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫు న్యాయవాది వాదించారు. నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పునకు కూడా ప్రభుత్వ మెమో విరుద్ధంగా ఉందని కోర్టుకు వివరించారు.
మరోవైపు పోడు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించాలని కోరుతూ ములుగు జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త కె.శ్రవణ్ కుమార్ ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ఆదివాసీల అటవీ హక్కుల చట్టం ఉద్దేశం అడవులపై ఆధారపడిన గిరిజనులకు ప్రయోజనాలు కల్పించడమేనని శ్రవణ్ కుమార్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు.
ఇరువైపుల వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ జూన్ 22కి వాయిదా వేసింది. అయితే పోడు భూముల క్రమబద్దీకరణను చట్టప్రకారమే నిర్వహించాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.