సెప్టెంబర్ 17. తెలంగాణ స్వేచ్ఛావాయులు పీల్చిన రోజు. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిన రోజు. నిజాం రజాకార్ల పీడ విరగడైన రోజు. భారత సమాఖ్యలో హైదరాబాద్ సంస్థానం కలిసిన రోజు. తెలంగాణ ప్రత్యేక సంస్థానంగా ఉండేది. భారత దేశంలో మొత్తం 565 సంస్థానాలు ఉండేవి. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దేశంలోని అన్ని సంస్థానాలు భారత్లో కలిశాయి. కానీ.. కశ్మీర్, జునాఘడ్, హైదరాబాద్ సంస్థానాలు కలవలేదు.
ఆ తర్వాత ఓవైపు తెలంగాణ ప్రజలు చేపట్టిన ఉద్యమం, సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన ఆపరేషన్ పోలోతో సెప్టెంబర్ 17 , 1948న నిజాం రాజు తలవంచారు. హైదరాబాద్ సంస్థానాన్ని అధికారికంగా భారత్లో కలిపారు. తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. దొరలు, భూస్వాముల చేతుల్లో ప్రజలు నరకయాతన అనుభవించారు. రజాకార్ల అరాచకాలతో తెలంగాణ పల్లెలు భయంతో వణికిపోయాయి. ఈనేపథ్యంలో తెలంగాణ పల్లెలు తిరగబడ్డాయి. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాయి.
ఈ క్రమంలో దొడ్డి కొమురయ్య వీరమరణంతో తెలంగాన రైతాంగ సాయుధ పోరాటం ఉవ్వెత్తున ఎగిసింది. ఈ క్రమంలో ఎందరో ప్రాణత్యాగం చేశారు. అప్పటికే బ్రిటీష్ పాలకుల నుంచి స్వాతంత్ర్యం పొందిన భారత్లో దాదాపుగా అన్ని సంస్థానాలు కలిశాయి. కానీ.. హైదరాబాద్ సంస్థానం మాత్రం కలవలేదు. నిజాం రాజు మొండికేశాడు. ఈక్రమంలోనే అప్పటికే నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాడుతున్న తెలంగాణ ప్రజల కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో చేపట్టారు.
భారత్ సైన్యం రంగంలోకి దిగిన తర్వాత నిజాం రాజు తలవంచారు. భారత్లో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసేందుకు ఒప్పుకున్నారు. ఎట్టకేలకు సెప్టెంబర్ 17, 1948న తెలంగాణ స్వేచ్ఛాయులు పీల్చింది. తెలంగాణలోని పల్లెలపై మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. అంటే.. భారతకు స్వాతంత్య్రం వచ్చిన చాలా నెలల తర్వాతగానీ.. తెలంగాణకు విముక్తి లభించలేదు.
అందుకే సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రతిష్టాత్మకం. ఇక ఇదే రోజును విమోచన దినంగా పాటించాలని, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. ఇదే సమయంలో మరికొందరు విద్రోహదినంగా పాటించాలని కోరుతున్నారు. ఇంకొందరు విలీన దినంగా పాటించాలని అంటున్నారు.