సెప్టెంబర్ 17. అందరూ ఈరోజున ఏం జరుగుతుంది.. బీజేపీ ఏం చేయబోతోంది.. ఏదో కీలక ప్రకటన చేయబోతోంది.. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వస్తున్నారు.. చేరికలు భారీగా ఉంటాయి.. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీకి చుక్కలే.. ఇవీ నిన్నటి వరకు సోషల్ మీడియాలో హల్చల్ చేసిన పోస్టులు..! నిన్నటి వరకు వినిపించిన ఊహాగానాలు. అయితే.. సెప్టెంబర్ 17 రానే వచ్చింది. కానీ.. నిన్నటి వరకు వినిపించిన ఊహాగానాలేవీ నిజం కాలేదు. కమలదళం కూడా కీలక ప్రకటన ఏమీ చేయలేదు. అంతకుమించి.. అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి కమలదళం గూటికి ఎవరూ చేరలేదు. నిజానికి.. రాష్ట్ర బీజేపీ నేతలు సెప్టెంబర్ 17పై విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. ఈరోజున ఏదో జరుగుతుందన్న భావనను ప్రజల్లో కలిగించారు.
సెప్టెంబర్ 17ను విమోచన దినంగా అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అధికార టీఆర్ఎస్ను ఇరుకునబెట్టేందుకు ప్రయత్నం చేశారు. ఎంఐఎంకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గిందని, అందుకే అధికారికంగా నిర్వహించడం లేదని ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. ఈరోజున పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను తీసుకొస్తామని కూడా పలుమార్లు చెప్పుకొచ్చారు. మరోవైపు.. అధికార టీఆర్ఎస్తోపాటు, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు కీలక నేతలు కూడా బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి.
ప్రధానంగా అధికార టీఆర్ఎస్కు గట్టిషాక్ తప్పదనే టాక్ బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలతోపాటు రాజకీయవర్గాలు కూడా సెప్టెంబర్ 17 కోసం ఆసక్తిగా ఎదురుచూశాయి. కానీ.. అందరూ అనుకున్నట్టే ఏమీ జరగలేదు. కమలదళం కీలక ప్రకటనలేమీ చేయలేదు. ఆ పార్టీలో ఎవరు కూడా చేరలేదు. పార్టీ కార్యాలయంలో విమోచన దినాన్ని నిర్వహించి, జాతీయపతాకాన్ని ఎగురవేశారు పార్టీ నాయకులు. కాకపోతే.. కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు.
తాము అధికారంలోకి వస్తే.. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉద్యమ సమయంలో అధికారికంగా నిర్వహించాలని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు నిర్వహించడం లేదని కమలం నేతలు ప్రశ్నించారు.