ఉమ్మడి రాష్ట్రంలో వరదలొస్తే అందరం కలిసి ప్రభుత్వానికి సహాయపడ్డామని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. కానీ ప్రస్తుత రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయని, నేటి రాజకీయాలు చాలా దిగజారాయని వ్యాఖ్యానించారు. వరదల్లో కూడా ఓవైపు ప్రజలు తిప్పలు పడుతోంటే.. మరోవైపు ప్రజలు ప్రాణాలతో పోరాడుతోంటే సాయం చేయాల్సింది పోయి.. ప్రతిపక్షాలకు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
చాలా మంది ప్రతిపక్ష నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రభుత్వ వైఫల్యం ఏదో ఉందని నిరూపించాలని ఆరాటపడ్డారని హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవ్వకూడదని కోరుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారని తెలిపారు. కానీ కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల ప్రజలు, రైతులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని పొగిడారని గుర్తుచేశారు. కాళేశ్వరం మునిగిపోవాలన్న కొందరి కలలు కల్లలయ్యాయని అన్నారు. కాళేశ్వరం ద్వారా ఈ నెలలోనే పైసా ఖర్చు పెట్టకుండా పొలాలకు నీరందిస్తామని మండలి సాక్షిగా మంత్రి మాటిచ్చారు.