ఫ్రీడం ఫర్ ర్యాలీలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ మైదానం నుంచి క్లాక్‌టవర్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. అధికారులు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు.
నేతలు, అధికారుల ప్రసంగాల అనంతరం.. ర్యాలీ ప్రారంభించే సందర్భంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పక్కనే ఉన్న కానిస్టేబుల్ చేతిలోని తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గాల్లోకి కాల్పులు జరపడం పోలీసు శాఖ నిబంధనలకు విరుద్ధమని విమర్శలు వస్తున్నాయి. మంత్రికి తుపాకి ఇచ్చిన కానిస్టేబుల్ ఎవరు? అందులో ఉన్నది డమ్మీ బుల్లెట్టా, ఉత్సవాల సందర్భంగా కాల్పులు జరిపే బుల్లెట్టా అనేది పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
ఈ వివాదంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరణ ఇచ్చారు. ‘‘ నేను పేల్చింది రబ్బర్ బుల్లెట్ గన్. ఫ్రీడం ఫర్ ర్యాలీ ప్రారంభోత్సవం కోసం జిల్లా ఎస్పీ స్వయంగా ఇచ్చిన రబ్బర్ బుల్లెట్ గన్‌తో పేల్చాను. పోలీసుల తుపాకి లాక్కొని కాలిస్తే ఊరుకుంటారా? గతంలోనూ క్రీడల ప్రారంభోత్సవానికి రబ్బర్‌గన్ పేల్చా. నేను ఆలిండియా రైఫిల్ అసోసియేషన్ సభ్యుడిని. గన్‌కు సంబంధించిన నిబంధనలన్నీ నాకు తెలుసు’’ అని శ్రీనివాస్‌గౌడ్ వివరించారు.