కేబినెట్ కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం

-

తెలంగాణ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంగా జరపాలని నిర్ణయించారు. 16, 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వజ్రోత్సవాలు, ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు.

రాచరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం రాగా.. ఆ సమయంలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలతో కూడిన హైదరాబాద్‌ సంస్థానం నిజాం పాలనలో ఉంది. 1948 సెప్టెంబరు 17న భారత్‌లో విలీనమైంది. తెరాస ఆవిర్భావం తర్వాత 2001 నుంచి ఏటా తెలంగాణ భవన్‌లో విలీన దినోత్సవాలను పార్టీ నిర్వహిస్తోంది. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా తెరాస తరఫునే ఉత్సవాలు జరుగుతున్నాయి. అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్లు వచ్చినా ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ నెల 17 నాటికి హైదరాబాద్‌ రాష్ట్రం విలీనమై 74 ఏళ్లు పూర్తయి, 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా విలీన దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో కేబినెట్ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Latest news